
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టీకరణ ఈనాడు, హైదరాబాద్‌: తనకు ఒక్క ఇంచు కూడా ఇనాం భూమి గానీ, ఎసైన్డ్‌ గానీ, మరోటి గానీ లేవని... పూర్తిగా పట్టా భూమి అని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత జి.జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘‘నాకున్న ఆస్తుల గురించి 2018, 2023 ఎన్నికల అఫిడవిట్‌లలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడారు. నేను 2015-16లోనే అక్కడ భూములు కొన్నా. అప్పటికి ధరణి లేనే లేదు. ఇలాంటప్పుడు ధరణిని అడ్డంపెట్టుకొని భూములు సొంతం చేసుకున్నామని సీఎం చేసిన ఆరోపణకు అర్థమే లేదు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలున్నాయని గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ అసత్యమని.. అసెంబ్లీలోనే సీఎం ఒప్పుకొన్నారు. మాపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం’’ అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలని ఒకవైపు సీఎం చెబుతూనే.. మరోవైపు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అంటున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబాలపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యాలు. సిరిసిల్లలో తోట ఆగయ్యకు మాజీ నక్సలైట్ల పునరావాసం కింద 2002లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన మూడున్నర ఎకరాల భూమిని ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లాక్కొంది’’ అని విమర్శించారు. తన పేరుతో ఉన్న చాలా భూములు 2014కు ముందే కొనుగోలు చేశానని ఎమ్మెల్సీ కె.నవీన్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చట్టప్రకారం తన ఆస్తులు, భూముల వివరాలను అధికారికంగా ప్రకటించానని ఆయన వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




