
రిటైర్డ్‌ ఉద్యోగుల సర్దుబాటుపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్ణయం సీఈ, ఈఈ పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు ఈనాడు, అమరావతి: కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గృహనిర్మాణ సంస్థలో తిరిగి విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపిన రిటైర్డ్‌ ఉద్యోగుల సర్దుబాటుపై అనిశ్చితి వీడింది. నిబంధనలకు అనుగుణంగా.. ఇప్పటికే ఆయా పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న వారిని రివర్షన్‌ చేసి వారి స్థానంలో రిటైరైన ఉద్యోగులను నియమించేలా గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దాదాపు 50 రోజుల క్రితం రిటైరైన ఉద్యోగుల నియామకానికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడగా.. 219 మంది తిరిగి విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపారు. ఇందులో మెజారిటీ పోస్టుల్ని భర్తీ చేయగా.. మేనేజర్, ఈఈ, సీఈ(11 మంది) పోస్టులకు సంబంధించి అనిశ్చితి కొనసాగింది. ఇప్పటికే ఆయా పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న వారిని రివర్షన్‌ చేసి వారి స్థానంలో రిటైరైన ఉద్యోగులను నియమించాలా? లేదా సమాన కేడర్‌ కలిగిన ప్రత్యామ్నాయ పోస్టుల్లో సీనియారిటీకి అనుగుణంగా సర్దుబాటు చేయాలా? అనే దానిపై తర్జనభర్జనలు కొనసాగాయి. తాజాగా దీనికి తెర దించుతూ రివర్షన్‌కే అధికారులు మొగ్గు చూపారు. సీనియారిటీ ప్రాతిపదికన నియామకాలు ప్ర భుత్వం కల్పించిన వెసులుబాటులో తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతి తెలిపిన 219 మందిలో మెజారిటీ ఏఈ, డీఈ, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల్లో పనిచేసే వారే ఉన్నారు. ప్రస్తుతం విధుల్లో చేరేవారి కంటే ఇంకా ఎక్కువ ఖాళీలున్నాయి. వీరి నియామకంలో సమస్య తలెత్తలేదు. కానీ సీఈ పోస్టుకు ఒకరు, ఈఈ పోస్టులకు నలుగురు, మేనేజర్‌ పోస్టుల్లో ఆరుగురు ఎక్కువగా ఉన్నారు. దీంతో రిటైరైన ఉద్యోగుల సర్దుబాటుకు ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న అత్యంత జూనియర్‌ అధికారులను వారి పాత హోదాకు రివర్షన్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




