
నిరంజన్‌ గుప్తా అనే సాయి భక్తుడు.. మోక్షం గురించి వివరించమని అడిగాడు. అప్పుడు సాయి- ‘నీకో కథ చెబుతాను విను! ఒకసారి నారదుడు నారాయణ స్మరణ చేస్తూ అడవి మార్గాన సాగిపోతున్నాడు. అక్కడ కట్టెలు కొడుతున్న ఓ వ్యక్తి నారదమహర్షిని ఆపి.. ‘స్వామీ! తమరు ఎక్కడికి వెళ్తున్నారు?’ అనడిగాడు. విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు వైకుంఠానికి వెళ్తున్నానని బదులిచ్చాడు దేవముని. ‘అయితే ఒక సాయం చేయండయ్యా! నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో స్వామిని కనుక్కుని.. ఈసారి ఇటుగా వచ్చినప్పుడు కాస్త చెప్పండి’ అన్నాడు. నారదుడు శ్రీహరిని దర్శించి, తిరిగి వెళ్తూ.. కట్టెలు కొట్టే వ్యక్తితో ‘సూది బెజ్జం లోంచి ఒంటె దూరి వెళ్లినప్పుడు నీకు మోక్షం వస్తుందని స్వామి చెప్పమన్నాడు’ అన్నాడు. అతడు ఆశ్చర్యంగా చూడగా.. ‘ఏళ్ల తరబడి తపస్సు చేసిన నాకే మోక్షం ఇవ్వకుండా స్వామి వాయిదా వేస్తున్నాడు. అలాంటిది నీకు ఎప్పటికి ఇచ్చేను? ఎక్కడైనా సూది బెజ్జం లోంచి ఒంటె వెళ్లగలదా?’ అన్నాడు నారదుడు. కట్టెలు కొట్టే వ్యక్తి చిరునవ్వు నవ్వి.. ‘స్వామి సర్వసమర్థుడు. ఆయన తలచుకుంటే.. ఏదైనా చేయగలడు’ అన్నాడు. అప్పుడు నారదుడు ‘నువ్వు భ్రమలో ఉన్నావు. నీకు మోక్షం లభించడం అసాధ్యం’ అన్నాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై.. ‘నారదా! నువ్వు నీ తపస్సును నమ్మావు కానీ నన్ను నమ్మలేదు. అందుకే నీకు మోక్షం లభించలేదు. ఇతడికి సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేదు. నేనేమైనా చేయగలనన్న అపార విశ్వాసం ఉంది. అందుకే ఇతడికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను’ అని పలికి, అదృశ్యమయ్యాడు. కాబట్టి ధర్మబద్ధమైన జీవనంతో పాటు దైవాన్ని విశ్వసించడమూ ముఖ్యమే’ అంటూ చెప్పాడు. నిరంజన్‌ గుప్తా సందేహం నివృత్తి అయ్యింది. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





