
పీఆర్ ఏఈ కుటుంబం నదిలో దూకిన ఘటనలో కీలక మలుపులు వెలుగులోకి సౌజన్య లేఖలు.. సాధిక్ అకృత్యాలు
మంగళవారం ఉదయం గోదావరిలో గాలింపు చర్యలకు సిద్ధమైన బృందం
ఈనాడు, రాజమహేంద్రవరం: కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు ప్రస్తుతం కీలక మలుపులు తిరిగింది. 45 రోజుల క్రితం అనారోగ్యంతో నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి చెందారని అంతా భావించినా.. అతనిపై విష ప్రయోగం జరిగిందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భర్తకు సాధిక్ విష పదార్థమిచ్చి చంపేశాడని స్వయంగా భార్య సౌజన్య రాసిన లేఖ లభ్యమైంది. అటు నూకరాజు రాసిన మరణ వాంగ్మూలం, ఇటు ప్రాణాలతో బయటపడ్డ పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, మరోవైపు సౌజన్య లేఖ సాధిక్ కిరాతకాన్ని బయటపెట్టాయి. రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు, కాకినాడ అధికారులకు సమాచారమిచ్చి సాధిక్ నివాసానికి వెళ్లగా అప్పటికే అతను పరారైనట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అతని గురించి గాలిస్తున్నాయి.
నూకరాజు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో సౌజన్య వాహనాన్ని పరిశీలిస్తున్న పోలీసు
ఏఈ నూకరాజు అందరితో సౌమ్యంగా ఉండే వ్యక్తి. భార్య మీనా, కుమారుడు, కుమార్తె, అల్లుడు, మనుమడితో ప్రశాంతంగా సాగిపోయే జీవనం. ఆ కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా కకావికలమైంది. కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, జులై 2న అల్లుడు మృతి, ఇప్పుడు చివరకు ఆ కుటుంబం మొత్తం గోదావరిలోకి దూకడం.. వరుస పరిణామాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక్క పదేళ్ల చిన్నారి మాత్రమే మిగిలాడు. మరోవైపు నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్యల కోసం నదిలో విస్తృతంగా గాలించినా మంగళవారం వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఎస్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది ఓ వైపు, డ్రోన్లతో పోలీసులు మరోవైపు గాలిస్తున్నారు.
నూకరాజు సోదరుడు, సోదరితోపాటు, వారి పిల్లలు, వియ్యంకుడు, ఇతర బంధువులంతా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇంత కష్టాన్ని ఎలా భరించారని, కనీసం మాటవరుసకైనా తమకు చెప్పలేదని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆ కుటుంబంలో నూకరాజు మినహా మరో పెద్ద దిక్కు లేకపోవడం, పరువు కోసం బతికేవారు కావడాన్ని నిందితుడు సాధిక్ ఆసరాగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. బాలుడు షూటింగ్లో శిక్షణకు చేర్చినప్పుడు, సౌజన్యతో ఏర్పడిన పరిచయాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నట్లు తెలుస్తోంది. జగదీశ్వరరెడ్డి మృతి చెందిన తరువాత సాధిక్ వేధింపులు మరింత పెరిగాయి. ఆస్తుల స్వాధీనంతో పాటు, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ కుటుంబం అల్లాడిపోయి మృత్యువే శరణ్యమనుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





