
ఇద్దరు పిల్లలకు పురుగు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగించి, తానూ తాగిన తండ్రి తండ్రి, కుమార్తె మృతి: విషమంగా కుమారుడి పరిస్థితి నేలకొండపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే పిల్లలతో శ్రీనివాసరావు (పాత చిత్రం) ఆ కన్నతండ్రికి మనసెలా వచ్చిందో దారుణానికి ఒడిగట్టాడు. శీతల పానీయంలో పురుగు మందు కలిపి తనతోపాటు ఇద్దరు పిల్లలకూ తాగించాడు. అల్లారు ముద్దుగా పెంచిన చేతులతోనే నిర్దాక్షిణ్యంగా వారిని చంపేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషాద ఘటనలో తండ్రీ కుమార్తె చనిపోగా, కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు(45), లీలా దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు లాస్య(14), కుమారుడు నిఖిల్‌. శ్రీనివాసరావుకు సొంతంగా పది ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు పక్కనే ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో సైతం పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో చదివిస్తున్నారు. లాస్య ఎనిమిదో తరగతి, నిఖిల్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. వినాయక చవితి సెలవులకు కుమార్తె ఇంటికి రాగా, కుమారుడు హాస్టల్‌లోనే ఉన్నాడు. సెలవుల అనంతరం బుధవారం తన కూతురిని బైక్‌పై ఎక్కించుకొని కోదాడకు వెళ్లాడు. కూతురితోపాటు హాస్టల్‌లో ఉన్న కుమారుడిని కూడా తీసుకొని ఏపీలోని గండ్రాయి వద్ద కౌలుకు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. గడ్డిమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాను తాగి, ఇద్దరు పిల్లలకు తాగించాడు. కొద్ది సేపటికి తండ్రీకుమార్తె అపస్మారక స్థితికి చేరుకోగా నిఖిల్‌ తీవ్రంగా వాంతులు చేసుకున్నాడు. బాధ భరించలేక పొలం నుంచి బయటకు వస్తున్న చిన్నారిని చూసి స్థానికులు ప్రశ్నించారు. ముగ్గురినీ వెంటనే గండ్రాయికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు అప్పటికే మృతి చెందాడు. లాస్య చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నిఖిల్‌ను హైదరాబాద్‌కు తరలించారు. శ్రీనివాసరావు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న విషయం తెలియరాలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.