
పలు రాష్ట్రాల ముఖ్య నేతల పేర్ల పరిశీలన దిల్లీ వెళ్లిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల ముఖ్యనేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌ వెళుతున్నందున ఆమె స్థానంలో వెంటనే మరొకరిని నియమించడం... లేదంటే మరో 2, 3 నెలలపాటు ఆమెనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ బాధ్యతలను పర్యవేక్షించేలా చూడడంపైనా ఏఐసీసీలో చర్చ సాగుతున్నట్లు నేతలు వివరించారు. మీనాక్షికి వీడ్కోలు పలికేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లారు. గురువారం ఆయన మీనాక్షితో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు... 2, 3 జిల్లాల కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల మార్పు, నామినేటెడ్‌ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చించి ఏఐసీసీకి నివేదిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మీనాక్షి అభిప్రాయాలు తీసుకుని... ఈ పదవుల భర్తీపై ఏఐసీసీ తుది నిర్ణయాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున ఏఐసీసీ తరఫున రాష్ట్ర ఇన్‌ఛార్జిగా పనిచేసేందుకు పలు రాష్ట్రాల నేతలు ఆసక్తిచూపుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంలు అశోక్‌ గెహ్లోత్, దిగ్విజయ్‌సింగ్, గుజరాత్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష మాజీ నేత, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసింగ్‌ గోయల్, తమిళనాడు మాజీ ఎంపీ చెల్లకుమార్, కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ తదితర నేతల పేర్లపై ఏఐసీసీలో చర్చ జరుగుతోంది. దిగ్విజయ్‌సింగ్‌కు ఉమ్మడి ఏపీలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవముంది. 2028 డిసెంబరులోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నందున సీనియర్‌ నేత, విజయవ్యూహాలను రచించే సామర్థ్యమున్న వారినే రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఏఐసీసీ నియమించే అవకాశాలున్నాయని సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీతో సమన్వయం చేసుకుని అందరినీ ఏకతాటిపై నడిపించే సత్తా ఉన్నవారినే ఏఐసీసీ పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకుని... ఆయనతో కలిసి పనిచేసే నేతనే ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. మహేశ్‌కుమార్‌గౌడ్‌ సైతం ఏఐసీసీ అగ్రనేతలను గురువారం కలిసి తన అభిప్రాయాలు చెప్పనున్నారని సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





