
సామాజిక ఆర్తిని, అశాంతిని జీవద్భాషలో వెలువరించిన మహానుభావుడు. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా భారతజాతి ఏకత్వం కనిపిస్తుంది. కుల, మతాల కంటే మానవత్వాన్ని ఆశించిన జాతీయవాది భీమన్న. ‘బలం గలవాడు, పులి తెలివిగలవాడు, నక్క ఈ వర్గాలకు ఆహారంగా బతుకుతున్న మూర్ఖులు గొర్రెలు’ అంటూ అమాయక జనానికి హితవు పలికాడు బోయి భీమన్న. ‘నాకు తిండి దొరక్కపోతే పస్తులు ఉండను. ఉపవాసాలు చేస్తాను. నాకు పేదరికం లేదు. నాకు బట్టలు దొరక్కపోతే నేను చింకి పాత బట్టలు కట్టను. దిగంబరోద్యమం చేస్తాను. నాకు పేదరికం లేదు’ అనే కవితా పంక్తుల్లో భీమన్న వ్యక్తిత్వం, ఆత్మాభిమానాన్ని చూడొచ్చు. మరోచోట ‘నాకు రాజకీయాల్లేవు. ఏ విధానంతోనూ పొత్తు లేదు. నేను పదవులు ఇచ్చే నాయకుడనో.. మార్కులు ఇచ్చే ఆచార్యునియో కాదు.. నేనొక మామూలు తోటమాలిని. నీకు నచ్చిన పూలుంటే కోసుకొంటూ ఉండు. ఇష్టమైతే ఇక్కడే ఉండు’ అంటూ భీమన్న చేసిన ప్రకటన ఆయన నిరాడంబర జీవనసరళికి నిదర్శనం. గ్రామ దేవతల నుంచి బాబాల దాకా ‘చిత్తం పూజల మీద ప్రజల మీద కాదు/టీచర్ల నుంచి ప్రొఫెసర్ల దాకా దృష్టి జీతం మీదే.. చేత మీద కాదు’ అంటూ నిజాలను నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పడంలో ఆయన శైలి ఉదాత్తమైనది. బోయి భీమన్న రచనల్లో పాలేరు నాటకం విశిష్టమైనది. స్వయంగా కష్టపడి చదివి ఒక విద్యావేత్తగా అధికారిగా ఎదిగిన ఒక పాలేరు జీవితాన్ని అద్భుతంగా చిత్రించిన నాటకం పాలేరు. సమాజంలో అమల్లో ఉన్న పుట్టుకులం పద్ధతి రద్దు కావాలి. గుణకర్మలను బట్టి కులం పరిగణించాలని అంటారు భీమన్న. బానిసలా పనిచేసే ప్రతి అస్వతంత్రుడు పాలేరే అంటాడు భీమన్న. భూస్వామ్య వ్యవస్థను, పాలేరుల జీవన వృత్తాంతాన్ని వాస్తవికంగా చిత్రీకరించారు. అదేవిధంగా ఒక సున్నితమైన భావోద్వేగపూరితపు ప్రేమ అనే కోణాన్ని జోడించి వనబాల వెంకన్న పాత్ర ద్వారా వర్ణాంతర వివాహాన్ని చిత్రించిన తీరు భీమన్న అంటరానితనం నిర్మూలన ధ్యేయం గోచరించింది. సామాన్య దళితుల్లో సామాజిక చైతన్యం చదువుకొంటేనే సాధ్యమనే వాస్తవాన్ని గ్రహించాలంటారు భీమన్న. ‘వ్యక్తుల వికాసమే జాతి. జాతుల వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణఫలం’ అనేది భీమన్న తాత్విక చింతన. అందుకే మన జాతికోసం విశ్వజనీయమైన ఒక మతాన్ని, ఒక వ్యవస్థను, నిర్దిష్టమైన సిద్ధాంతాలను నిర్మించాల్సిన అవసరం ఉందంటారు భీమన్న. పురాణేతిహాసాల సమగ్ర అవగాహనతో గాంధీ, అంబేద్కర్ తాత్వికభావాల సమ్మేళనంతో ఆయన రచనలు చేశారు. భీమన్న ఒడిదొడుకులతో నిండిన నిండైన బతుకు పుస్తకమే కాదు, వ్యక్తిత్వ వికాస నిర్మాణ శిల్పి కూడా. కుల నిర్మూలన, పంచముల ఐక్యత, జాతీయ సోషలిజం, పట్టణీకరణ, పంచముల అధికారం అనే ఐదు సూత్రాలు ఆయన సాహిత్యానికి భూమిక. పద్యం, గేయం, గద్యం, నాటకం, నాటిక, వ్యాసం, కవిత, వచనం వంటి పలు సాహిత్య ప్రక్రియల్లో 70కి పైగా రచనలు చేశారు. సాహిత్యం ఊపిరిగా, కవిత్వం ఆత్మగా జీవనాన్ని సాగించిన కారణజన్ముడు బోయి భీమన్న. జాతీయతతో పుట్టి పెరిగి దేశీయ వాస్తవికతను అనుగుణంగా ఉంటూ ఆత్మగౌరవంతో జీవించాలంటారు ఆయన. తన ప్రతి రచనా తన ఆత్మకథగానే చెప్పుకొన్నారు. భీమన్న సంప్రదాయ, ఆధునిక, అభ్యుదయ మార్గాల సమన్వయకర్తగా దర్శనమిస్తారు. ప్రతి జాతికి దేశానికి ఒక జీవనశైలి ఉంటుంది భారతదేశంలో సామాజిక సమతను సాధించడానికి ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని సాధించే ప్రయత్నం చేయాలని ఆయన అంటారు. మనిషికి, మనిషికి నడుమ ఉండే అంతరాన్ని తొలగించడానికి, శ్రమ ఫలాన్ని దోచుకొనే తత్వాన్ని పోగొట్టుకోవడానికి పేదవాని మెదడులో వేద జ్ఞానం నిండాలని కోరుకొన్నారు. జాతి రీత్యా మనమందరం ఒక్కటే. మతాలు మార్చుకోవచ్చుగాక. కానీ జాతి శాశ్వతమైనదని, అందరూ కలిసి జాతీయ భావాన్ని పెంపొందించాలని ఆయన అంటారు. – కోడోజు కృష్ణమూర్తి 8500167845





