
యూటీఎఫ్‌ నాయకులకు ఎన్‌సీటీఈ అధికారుల వెల్లడి దిల్లీలో ఎన్‌సీటీఈ డిప్యూటీ కార్యదర్శి సతీష్‌ కుమార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌టీఎఫ్‌ఐ అధ్యక్షుడు సీఎన్‌ భారతి, ప్రధాన కార్యదర్శి చావా రవి, యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సిలబస్, అర్హత మార్కులు, పరీక్షా విధానాన్ని సమీక్షించి అవసరమైన మార్పులు సూచించడానికి ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌సీటీఈ అధికారులు వెల్లడించారు. యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్, ఎస్‌టీఎఫ్‌ఐ అధ్యక్షుడు సీఎన్‌ భారతి, ప్రధాన కార్యదర్శి చావా రవి బుధవారం దిల్లీలో ఎన్‌సీటీఈ ఛైర్మన్‌ పంకజ్‌ అరోరా, సభ్య-కార్యదర్శి సుఖజీత్‌ కౌర్, డిప్యూటీ కార్యదర్శి సతీష్‌ కుమార్‌ తదితరులను కలిసి, వినతిపత్రాలు సమర్పించారు. టెట్‌లో ఇబ్బందులను వారికి వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 నాటికి టెట్‌ అర్హత సాధించాలనే నిబంధనతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, సిలబస్‌ను శాస్త్రీయంగా నిర్ణయించాలని, సబ్జెక్టు వారీగా పరీక్షలు నిర్వహించాలని విన్నవించారు. అర్హత మార్కులు తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారని యూటీఎఫ్‌ పేర్కొంది. అనంతరం యూటీఎఫ్‌ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్‌ సదన్‌కు వెళ్లారు. వచ్చే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





