
బొమ్మనహాళ్: గణేశ్‌ నిమజ్జనానికి వెళ్లిన యువకుడు ఒకరు కాలువలో గల్లంతు అయ్యారు. ఈ సంఘటన బొమ్మనహాళ్‌ మండలం ఉప్పరహల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పరహాల్ గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని నిమజ్జనం కోసం గ్రామం నుంచి ఊరేగింపుగా గోరసలపల్లి రోడ్డులోని హెచ్ఎల్‌సీ కాలువకు తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం స్నానం చేస్తున్న సమయంలో మేనవల్లి సాయి భరత్ కుమార్ (22) ఈత కొట్టేందుకు ప్రయత్నించి గల్లంతు అయ్యాడు. వారిస్తున్నా యువకుడు కాలువలో దూకినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు నీటిలో మునిగి పోతుండగా అక్కడే ఉన్న అతడి తండ్రి శ్రీనివాస్‌ కాపాడేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న బొమ్మనహాళ్‌ ఎస్సై నబిరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలం చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది సైతం భరత్‌కుమార్‌ వినాయక నిమజ్జనం వేళ కాలువలో దూకడంతో వెంటనే సమీపంలోని వారు రక్షించినట్లు గ్రామస్థులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




