
చెన్నై: నిదానంగా ఆలోచించి రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంపై ‘ఎక్స్’ వేదికగా వీడియో పంచుకున్నారు.
తన రాజకీయ అరంగేట్రం గురించి గతంలో విడుదల చేసిన వీడియో సందేశానికి పలువురు స్పందించారని, ‘రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చు కదా? దాని గురించి ప్రజలను ఎందుకు అడగటం’ అంటూ ప్రశ్నించారని తెలిపారు. ‘ఫౌండేషన్ను మాత్రం చూసుకో, రాజకీయాల్లోకి రావద్దు’ అని ప్రజలు భావిస్తే?.. అందుకే వారి అభిప్రాయాన్ని అడిగానన్నారు.
‘‘ప్రజల నిర్ణయాన్ని కోరడంలో తప్పేముంది. నేను ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పలేదు. నలుగురికి అన్నం పెట్టాను, సాయం అందించానని రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పలేదు. నలుగురికి మంచి చేస్తున్నాను కాబట్టి, రాజకీయాల్లోకి వస్తున్నానని మాత్రమే చెప్పా. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నాకు ఓట్లు వేస్తామని పలువురు చెప్పారు. నేను పోటీ చేయాలనుకోవడం ధర్మం కాదు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కార్యకర్తగా కొంతకాలం సేవలు అందించాలనుకుంటున్నా. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తా. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా’’
‘‘తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయనని చెబుతున్నాను. అలాగని ఇంకెక్కడా పోటీ చేయనని అర్థం కాదు. నిదానంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. తొందరపాటుతో ఏదీ చేయను. ఇంకాస్త ఆలోచించిన తర్వాతే రాజకీయాల్లోకి వస్తా. ప్రజల ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో ఉన్నా. ఎవరైనా విమర్శ చేస్తే తట్టుకోలేను. నా సంపద వాళ్లు ఇచ్చిందే. ఇలాంటి సమయంలో ఎవరైనా నాపై తప్పుగా మాట్లాడితే బాధ కలుగుతుంది. ఈ విషయంలో మా అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుని, రాజకీయాలకు దూరంగా ఉండమన్నారు. మా అమ్మ నాకు తొలి అభిమాని. గొప్ప స్నేహితురాలు. మా అమ్మ ఆశీస్సులు లేకపోతే, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ప్రజా తీర్పే శక్తిమంతమైన తీర్పు. ’’ అని లారెన్స్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ జరగనున్న ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.