ముంబయిలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గత రెండు రోజులుగా ముంబయిలో కురిసిన వర్షాలకు చెంబూరులో ఓ పాఠశాల బస్సుపై చెట్టుకూలి ఒక విద్యార్థి మృతిచెందాడు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 15 చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గాయపడిన చిన్నారులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2.58 గంటల సమయంలో యూనివర్సల్ హై స్కూల్ బస్సు విద్యార్థులతో వస్తుండగా ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, బీఎంసీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెట్టు కూలడంతో మినీ బస్సు ధ్వంసమైంది. అందులో ఇరుక్కుపోయి చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.ఇదిలా ఉండగా, ఆ ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, చెట్లను తొలగించాలని కోరుతూ తాము బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి పదేపదే లేఖలు రాశామని, పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. భారీ వర్షం కారణంగానే చెట్టు కూలిపోయినట్టు తెలుస్తోంది.గతవారం నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబయిను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి కేవలం 4 గంటల్లోనే 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా లోకల్, సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారీగా నీరు నిలవడంతో రహదారుల చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాన నీటితతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంధేరి ప్రాంతంలోని సబ్వే పూర్తిగా నీట మునిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యగా ఈ అండర్‌పాస్‌ను మూసివేసినట్లు బీఎంసీ వెల్లడించింది. అటు, ప్రతికూల వాతావరణం వల్ల విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన భారత వాతావరణ శాఖ.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.