
భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా విలువైన సలహాలు ఇచ్చాడు.
రేపటి నుంచి ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు వైభవ్ ఎంపికైన నేపథ్యంలో అతని చుట్టూ పెరుగుతున్న ప్రచారం ఒక ఆటంకంగా మారకూడదని పుజారా హితవు పలికాడు. భారత జట్టు ప్రస్తుత టాప్ ఆర్డర్ చాలా స్థిరంగా ఉన్నందున, వైభవ్‌కు తుది జట్టులో వెంటనే చోటు దక్కడం కష్టమని అభిప్రాయపడ్డాడు. దీర్ఘకాలిక విజయం కోసం సహనం, సరైన సన్నద్ధత చాలా కీలకమని పుజారా చెప్పాడు.ఈ పర్యటనకు ముందు పుజారా మాట్లాడుతూ.. "ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ చుట్టూ చాలా హైప్ ఉంది. ఒక యువ ఆటగాడిగా, తన గురించి బయట వస్తున్న మాటలను అస్సలు పట్టించుకోకూడదు. బయటి ప్రపంచం నుంచి వచ్చే శబ్దాలను పక్కనపెట్టి, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టాలి" అని సూచించాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.జట్టు ఎంపిక గురించి పుజారా మాట్లాడుతూ.. "వైభవ్ మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ, జట్టులోకి ఎంపికవ్వడం వేరే విషయం. ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి వెంటనే అవకాశం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే భారత జట్టు తమ టాప్-3ని మార్చడానికి ఇష్టపడదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి నాణ్యమైన బ్యాటర్లు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి తొలి మూడు మ్యాచ్‌ల వరకు వైభవ్ వేచి ఉండాల్సి రావచ్చు" అని స్పష్టం చేశారు.