
Suryapet: యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలి.. ఏఐకేఎంఎస్ డిమాండ్ సూర్యాపేట: రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో నూతనకల్ తహసిల్దార్...
Suryapet: యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలి.. ఏఐకేఎంఎస్ డిమాండ్
సూర్యాపేట: రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో నూతనకల్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వోకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ డివిజన్ కమిటీ సభ్యులు ముప్పాని సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటల సాగుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని నకిలీ కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది యూరియా యాప్ ద్వారా పంపిణీ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, రైతు భరోసాను ముందుగానే ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రైతులకు బ్యాంకు రుణాలు సకాలంలో అందించాలని, అన్ని రకాల సన్న వడ్లకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘రైతే రాజు’ అని గొప్పలు చెబుతున్నా, రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు దగ్గుల మల్లయ్య, జటంగి సతీష్, ముండ్ల మల్లయ్య, పిల్లి వీరయ్య, ఉమేష్, రామకృష్ణ, పిడమర్తి అంజయ్య, సామా నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.