ఉమేష్ చంద్ర ఐపీఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ చరిత్రలోనే అత్యంత సాహసవంతుడైన, నిజాయితీపరుడైన అధికారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, సమాజ వ్యతిరేకుల శక్తుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆయన.. 33 ఏళ్ల వయసులోనే అమరుడయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్రను నక్సలైట్లు కాల్చి చంపారు. ఆ ప్రదేశంలోనే ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయన బతికి ఉంటే.. ఈ ఏడాది డైరెక్టర్ జనరల్ హోదాలో రిటైర్ అయ్యేవారు.1966 మార్చి 29న జన్మించిన ఉమేష్ చంద్ర 1999 సెప్టెంబర్ 4న అమరుడయ్యారు. ఉమేష్ చంద్ర మరణించి 27 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఆయన మిత్రుడు, బ్యాచ్మెట్ అయిన మాదిరెడ్డి ప్రతాప్ మాత్రం ఆయన సేవలను మర్చిపోలేదు. నేడు (జూన్ 30)న డీజీ హోదాలో రిటైర్ అయిన మాదిరెడ్డి ప్రతాప్.. పదవీ విరమణ సందర్భంగా తన దివంగత మిత్రుడికి అరుదైన గౌరవం కల్పించారు.మంగళవారం ఉదయం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసు నుంచి తెనాలికి సైకిల్ మీద వెళ్లిన మాదిరెడ్డి ప్రతాప్.. మూడున్నర దశాబ్దాలపాటు ప్రజా సేవకు ప్రతీకగా తాను ధరించిన పోలీసు యూనిఫాంను తన మిత్రుడి విగ్రహం వద్ద ఉంచి నివాళులు అర్పించారు. తద్వారా తన ఆత్మీయ మిత్రుడికి ఆయన అరుదైన గౌరవం కల్పించారు. ఉమేష్ చంద్ర పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి, తమ స్నేహబంధానికి ఆయన ఇచ్చిన విలువకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఆయనతోపాటు పోలీసు సిబ్బంది సైతం ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గురించి..మాదిరెడ్డి ప్రతాప్ సొంతూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట. 1996 జులై 1న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎంతో కష్టపడ్డారు. తన తండ్రి వ్యవసాయం చేస్తే.. తల్లి పాలు విక్రయించేదని.. తాను కూడా పాలు పోసేవాడినని ఆయన చెబుతుంటారు. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ స్థాయికి ఎదిగినప్పటికీ ఆయన తన మూలాలను మర్చిపోలేదు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ప్రతాప్.. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1991లో ఐపీఎస్‌కు ఎంపికైన మాదిరెడ్డి ప్రతాప్.. ఆర్టీసీ ఎండీ సహా పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 2001లో ఉద్యోగానికి సెలవు పెట్టి వార్టన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివారు. ప్రతాప్‌కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎంబీఏ క్లాస్మేట్ కావడం విశేషం. 60 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో ఫిట్‌గా ఉంటారు.