శివ కార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో ఈ పీరియడ్ మూవీ తెరకెక్కింది. 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం..
బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రెమ్యునరేషన్ ఇంకా చెల్లించలేదని డైరెక్టర్ సుధా కొంగర హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.‘పరాశక్తి’ సినిమాని డాన్ పిక్చర్ బ్యానర్ పై రూపొందించారు. ఈ చిత్రానికిగాను సుధా కొంగరకు రూ.15 కోట్ల పారితోషికం ఇచ్చేలా మాట్లాడుకున్నారట. దానికి అదనంగా జీఎస్టీ కలుపుకొని మొత్తం రూ.17.70 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అందులో నిర్మాతలు ఇప్పటివరకూ రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగతా రూ.8.39 కోట్లు ఇవ్వడం లేదని సుధా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బకాయిలు చెల్లించే వరకు ‘ఇదయం మురళి’ విడుదలను నిలిపివేయాలని కోరారు.డాన్ పిక్చర్ నిర్మిస్తున్న ‘ఇదయమ్ మురళి’ సినిమాని జూలై 10న థియేటర్లలో విడుదల కానుందని సుధా కొంగర తరపు న్యాయవాదులు నిత్యేష్ నటరాజ్, వైభవ్ వెంకటేష్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరి నిమిషంలో వచ్చి సినిమా విడుదలను అడ్డుపడుతున్నారనే నెపం లేకుండా, ముందే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శ్యాటిలైట్ టెలికాస్ట్/రిలీజ్‌ను జూలై 8 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. అలానే ‘ఇదయమ్ మురళి’ సినిమాను నిలిపివేయాలన్న సుధా కొంగర విజ్ఞప్తిపై జూలై 7 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డాన్ పిక్చర్స్ యాజమాన్యానికి సూచించింది.