
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యంత ఉత్కంఠతో నిరీక్షిస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీఎగ్జామ్ ఫలితాల ప్రకటనకు నేషనల్...
టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కసరత్తును ముమ్మరం చేసింది. జూన్ 21న దేశవిదేశాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాల (OMR Sheets) మూల్యాంకన ప్రక్రియను ఎన్టీఏ అధికారికంగా ప్రారంభించింది. జాతీయ స్థాయిలో వైద్య విద్యా ప్రవేశాలకు ఈ పరీక్షే అత్యంత కీలకం కావడంతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా అతి త్వరలోనే ఈ ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు.10 వేల ఆక్షేపణలు.. సబ్జెక్టు నిపుణుల స్క్రీనింగ్!పరీక్షా సరళి, ప్రశ్నలపై ఎన్టీఏ విడుదల చేసిన ప్రాథమిక కీ’ పై అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో రాతపూర్వక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు పది వేలకు పైగా ఆక్షేపణలు రాగా, బోర్డు వాటన్నింటినీ సబ్జెక్టు నిపుణుల (Subject Experts) కమిటీకి అప్పగించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు చెందిన ఈ ప్రత్యేక కమిటీ ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ పరిశీలన ప్రక్రియ ముగిసిన వెంటనే, విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న అధికారిక తుది కీ (Final Key) తో పాటు ఫైనల్ ఫలితాలను ఒకేసారి యుద్ధప్రాతిపదికన విడుదల చేయడానికి ఎన్టీఏ సర్వం సిద్ధం చేస్తోంది.సీబీఐ విచారణ నీడలో.. 20 లక్షల మంది భవితవ్యం!ఈ విద్యా సంవత్సరంలో తొలుత జరిగిన నీట్ పరీక్షలో పత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసుతో సంబంధమున్న పలువురు కీలక నిందితులను కూడా దర్యాప్తు సంస్థ ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ అక్రమాల నేపథ్యంలోనే పరీక్ష పారదర్శకతను, విద్యార్థుల నమ్మకాన్ని కాపాడేందుకు ఎన్టీఏ ఈ పునఃపరీక్షను (Re-Examination) ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సి వచ్చింది. NEET UG 2026 Answer Key: నీట్ ఆన్సర్ కీ విడుదల తేదీ- డౌన్ లోడ్ ఇలా..!ఈ రీ-ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 ముఖ్యమైన నగరాల్లో అత్యంత పటిష్టమైన నిఘా నడుమ నిర్వహించారు. సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భారతీయ భాషల్లో ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.మానవత్వం చాటుకున్న బోర్డు.. ప్రత్యేక సదుపాయాలు!ఈసారి పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ మానవతా దృక్పథాన్ని, పటిష్టమైన సమన్వయాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా దివ్యాంగులు, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అభ్యర్థుల కోసం అసాధారణ ఏర్పాట్లు చేసింది. పరీక్ష రాసిన వారిలో 10 వేల మందికి పైగా శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులు ఉండగా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 81 మంది అభ్యర్థుల కోసం బోర్డు ప్రత్యేక వసతులు కల్పించింది. రోడ్డు ప్రమాదం నుండి కోలుకుంటున్న ఒక విద్యార్థికి, కీమోథెరపీ చికిత్స పొందుతున్న మరొకరికి పరీక్ష రాసేందుకు తగిన సౌకర్యాలు కల్పించి అండగా నిలిచింది.కేంద్ర సంస్థల అండతో.. పారదర్శకంగా ఫలితాలు!ఈ భారీ జాతీయ స్థాయి పరీక్షను అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయడం వెనుక పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల అద్భుతమైన సమన్వయం ఉంది. కేంద్ర సాయుధ బలగాలు (CAPF), భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోమ్- రక్షణ శాఖలు భద్రతా పరంగా ఎంతో సహకరించాయి. అలాగే సాంకేతిక, ఆర్థిక భాగస్వామ్య సంస్థలైన ఎన్‌ఐసీ (NIC), ఐటీ విభాగాలతో పాటు ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంకులు కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాయి. NEET: ఇదెక్కడి మాస్ కాపీయింగ్ బ్రో! వాష్ రూమ్ వెంటిలేటర్ టు ఫ్లష్ ట్యాంక్.. అనేక వివాదాలు, సుదీర్ఘ చర్చల తర్వాత ముగిసిన ఈ నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ ఫలితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎటువంటి లోపాలు దొర్లకుండా, అత్యంత పారదర్శకమైన రీతిలో ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించేందుకు ఎన్టీఏ ఉన్నతాధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ తుది ప్రక్రియ ముగియగానే విద్యార్థుల ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.