
ఇంటర్నెట్ డెస్క్: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇరు దేశాధినేతల స్నేహం మూలస్తంభం అని యూఎస్ రాయబారి సెర్గియో గోర్ అన్నారు.
వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (USISPF)లో పాల్గొన్న ఆయన.. మోదీ-ట్రంప్ (Modi-Trump) బంధాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్న ఆయన.. ప్రధాని మోదీకి ఓసారి ట్రంప్ ఉదయం ఆరు గంటలకే ఫోన్ చేయాలనుకున్నట్లు తెలిపారు.
‘‘రెండు నెలల కిందట మియామిలో యూఎఫ్‌సీ ఈవెంట్ జరిగింది. ఆ సమయంలో నేను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్నాను. వేదిక పక్కన మేం మాట్లాడుకుంటూ ఉండగా.. ‘మోదీ (PM Modi)కి కాల్ చేద్దాం’ అని ట్రంప్ అన్నారు. ‘ఇప్పుడు భారత్‌లో సమయం ఉదయం 6 గంటలు’ అని నేను చెప్పా. దానికి అధ్యక్షుడు బదులిస్తూ.. ‘ఏం ఫర్వాలేదు. ఆయన (మోదీ) నిద్రలేచే ఉంటారు. ఎక్కువ సేపు పడుకోరు. ఆయనకు నేనంటే ఇష్టం’ అని అన్నారు. ఆ తర్వాత ట్రంప్ (Donald Trump) వేరే బాధ్యతల్లో ఉండటంతో మోదీతో కాల్‌ను మరుసటి రోజుకు షెడ్యూల్ చేశారు. అయితే, ఈ సంఘటన వారిద్దరి మధ్య మైత్రిని చాటిచెబుతుంది. ఎవరితోనైనా స్నేహం చేస్తే.. అన్నిటినీ షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ను చూశాక నాకనిపించింది. మోదీ ఆయనకు గొప్ప స్నేహితుడు’’ అని సెర్గియో గోర్ (Sergio Gor) వెల్లడించారు.
కాగా.. ఈ సదస్సులో అమెరికా రాయబారి పలు అంశాల గురించి మాట్లాడారు. ఇటీవల అగ్రరాజ్యానికి చెందిన ‘ఇండో-పసిఫిక్ కమాండ్’ పేరులో ‘ఇండో’ పదాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై సెర్గియో గోర్ స్పందిస్తూ.. ‘‘లెటర్‌హెడ్‌పై ఏం పేరు ఉందన్న విషయాన్ని పట్టించుకోవద్దు. అమెరికా వాస్తవంగా ఏం చేస్తుందో.. ఆ చర్యలనే గమనించాలి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కలిసి సైనిక విన్యాసాలు చేస్తోంది. రానున్న రెండు వారాల్లో భారత నేవీ బృందం అమెరికాలో పర్యటించనుంది. పేరు మారినంత మాత్రాన.. ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయనుకుంటే పొరపాటే అవుతుంది. వాణిజ్యమైనా.. రక్షణ రంగమైనా.. భారత్-అమెరికా మధ్య బంధం బలంగా ఉంది’’ అని గోర్ వివరించారు.
ఇక, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా రాయబారి ప్రస్తావిస్తూ.. ‘‘ట్రేడ్ డీల్‌పై తుది దశకు చేరుకున్నాం. చాలా అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. కేవలం ఒకటి లేదా 2 శాతం ఉత్పత్తులపై అంగీకారానికి రావాల్సి ఉంది. అతి త్వరలోనే ఈ ఒప్పందంపై ప్రకటన వస్తుంది’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత పర్యటన గురించి సెర్గియో గోర్ మాట్లాడారు. భారత్‌లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు ఎదురుచూస్తున్నారని, మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ పర్యటన ఉండొచ్చని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.