
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జనసేన పార్టీ(Janasena) తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా ‘జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ’ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు ఈ కమిటీ ప్రతినిధులు ముమ్మరంగా సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయి నుంచి కీలక సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ ఐదు రోజుల షెడ్యూల్లో భాగంగా కమిటీ సభ్యులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున సమీక్షా సమావేశాలు జరపనున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీ ప్రస్తుత పరిస్థితి, క్రియాశీలక సభ్యుల వివరాలు, స్థానిక నాయకత్వ బలాబలాలు మరియు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తల నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుంది. పార్టీ నిర్మాణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను మొత్తం 32 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి పరిశీలన కమిటీని జనసేన అధిష్ఠానం రంగంలోకి దించింది.
ఈ 32 మంది ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేస్తారు. సమాచార సేకరణ కమిటీ ఐదు రోజుల పాటు జరిపే ఈ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, సేకరించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను పరిశీలన కమిటీ క్రోడీకరిస్తుంది. ఈ తుది నివేదికను పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు(Pawan Kalyan) సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే రాబోయే రోజుల్లో జనసేన నియోజకవర్గ కమిటీలు, అనుబంధ విభాగాల నియామకాలు మరియు పార్టీ సంస్థాగత మార్పులపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.