
దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో లేని వారు, చనిపోయినవారు
, వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయిన వారి పేర్లను మాత్రమే ఇందులో నుంచి తొలగించాల్సి ఉండగా.. ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీలు, ప్రభుత్వాల సూచనల మేరకు విపక్ష పార్టీలకు చెందిన వారిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది.
జూన్ 8 జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఇందులో 21 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత ఎన్నికల సంఘం యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి సంయుక్త లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారని జైరాం రమేశ్ వెల్లడించారు. దీనికి అనుగుణంగా, 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్థి సంతకాలు చేసిన ఉమ్మడి లేఖను ఇవాళ సీజేకు పంపినట్లు తెలిపారు. స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా ఈ ఉమ్మడి లేఖపై సంతకం చేశారు. ఈ లేఖపై ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే కూడా సంతకాలు చేశాయని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ పేర్కొన్నారు. ఈ లేఖలో ఎన్నికల సంఘం పాత్ర గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం.