
హాస్పిటాలిటీ సెగ్మెంట్ లో దిగ్గజం ఓయో (OYO) సంచలనాలకు తెర తీసింది. దీని మాతృ సంస్థ ప్రిజమ్ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ చేయనుంది.
దీని ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించేందుకు వీలుగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద తన నూతన అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను దాఖలు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ల ముందుకు త్వరలోనే మరో భారీ ఐపీఓ రానున్నట్లు స్పష్టమవుతోంది.ఈ ఏడాది ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ, జియో వంటి దిగ్గజ సంస్థల సంచలన ఐపీఓలకు తెర తీసిన విషయం తెలిసిందే. ఓయో కూడా పబ్లిక్ ఇష్యూ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ద్వారా కంపెనీ ఏకంగా రూ. 6,650 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా లభించే భారీ నిధులతో కంపెనీ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, వ్యాపార వ్యూహాలను మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.హాస్పిటాలిటీ సెగ్మెంట్ లో ఉన్న ఊపును అందిపుచ్చుకుంటూ మార్కెట్ లో తన ఉనికిని మరింత విస్తరించుకోవడమే లక్ష్యంగా ఓయో యాజమాన్యం అడుగులు వేస్తోంది. సాధారణంగా ఇటువంటి భారీ సంస్థలు పబ్లిక్ ఆఫర్లలో వ్యవస్థాపకులు లేదా పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించి నగదుగా మార్చుకునేందుకు అనువుగా ప్రమోటర్ల కోటా నుండి ఆఫర్ ఫర్ సేల్ భాగం అందుబాటులో ఉండటం ఆనవాయితీ. ఓయో తాజాగా సెబికి అందించిన ప్రతిపాదనల్లో ఎటువంటి ఆఫర్ ఫర్ సేల్ పొందుపర్చలేదు.అంటే.. ప్రస్తుతం సంస్థలో పెట్టుబడి పెట్టిన వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్‌తో పాటు ప్రధాన భాగస్వాములైన సాఫ్ట్‌బ్యాంక్ ఎస్‌వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్, ఎయిర్‌బిఎన్‌బి వంటి అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలు, పీక్ ఎక్స్ వీ, లైట్‌స్పీడ్, ఖజానా, గ్రీన్‌ఓక్స్ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లు ఎవ్వరూ కూడా ఈ విడత ఐపీఓలో తమ వాటాలను విక్రయించట్లేదనే విషయం స్పష్టమైంది.కంపెనీ తన తుది డ్రాఫ్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ని తుది ఆమోదం కోసం దాఖలు చేయడానికి ముందు సుమారు రూ.1,330 కోట్ల మేర ప్రీఐపీఓ ప్లేస్‌మెంట్ నిర్వహించాలనే భావిస్తోంది. ఇది సక్సెస్ అయితే ఐపీఓ ద్వారా సాధారణ ఇన్వెస్టర్ల నుండి సేకరించాల్సిన అసలు మొత్తం పరిమాణం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కంపెనీ పబ్లిక్ ఇష్యూ వేల్యుయేషన్‌, షేర్ల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేయగులుగుతుంది.పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులలో సింహభాగాన్ని ప్రిజమ్ యాజమాన్యం రుణ చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని సుమారు రూ.4,987.50 కోట్లుగా తేల్చింది. ఈ విషయాన్ని సెబి ప్రాస్పెక్టస్ లోనూ పొందుపరిచింది. మిగిలిన నిధులను సంస్థ రోజువారీ కార్యకలాపాలు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలు, భవిష్యత్ వ్యాపార వృద్ధి వ్యూహాలకు వెచ్చిస్తుంది. ఇది కంపెనీకి పెద్దఎత్తున వడ్డీ భారాన్ని తగ్గించనుంది.