
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల దాడుల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్లను ఇకపై ముందుగానే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకు భద్రతకు సంబంధించిన చాలా మార్పులను కొత్త ఐఓఎస్ వెర్షన్తో కలిపి విడుదల చేసేది యాపిల్. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలకు ముందు డెవలపర్లు, బీటా వినియోగదారులు పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించేవారు. ఆ తర్వాతే పూర్తి అప్డేట్ అందుబాటులోకి వచ్చేది.కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మార్చాలని కంపెనీ నిర్ణయించింది. భద్రతకు సంబంధించిన కీలక సవరణలను పెద్ద అప్డేట్ కోసం వేచి చూడకుండా, వీలైనంత త్వరగా వినియోగదారులకు అందించాలని భావిస్తోంది. దీనివల్ల లోపాలు బయటపడిన వెంటనే వాటిని సరిచేసే అవకాశం ఉంటుంది.ఏఐ సాయంతో హ్యాకర్లు కొత్త పద్ధతులను చాలా వేగంగా రూపొందిస్తున్నారని యాపిల్ అభిప్రాయపడింది. అందుకే భద్రతా లోపాలను సరిచేసే సమయాన్ని తగ్గించడం ఇప్పుడు అత్యంత అవసరమని తెలిపింది. తాజాగా పరిష్కరించిన భద్రతా లోపాలను ఎవరూ దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.