20 ఏళ్ల వయసులో మీకు డబ్బు విలువ తెలియక చాలావరకు వృథా ఖర్చులు చేసి ఉంటారు. కానీ మీ వయసు 30 దాటిందంటే అవే ఖర్చులు మీకు డబ్బు విలువు తెలియజేస్తాయి.
అందుకే ఇకనైనా అర్థం చేసుకుని పొదుపు చేయడం ప్రారంభించండి. తద్వారా మీ ఫ్యామిలీ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోండి.
30 ఏళ్లు వచ్చాక ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉండి ఫ్యామిలీని దూరం పెట్టవద్దు. ఎందుకంటే మీరు కోల్పోయే సమయం మళ్లీ తిరిగి రాదు. మీ అమ్మానాన్నా, భార్య, పిల్లలతో సరదాగా గడపండి. ఈ సమయం మీకు ఎన్నో విలువైన జ్ఞాపకాలను అందిస్తుంది. జీవితానికి పరమార్థం తెలుస్తుంది. అలాగే మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
స్టూడెంట్‌గా ఉన్నపుడు ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తే మీ నాన్న వేరొకరి మార్కులతో పోల్చి మిమ్మల్ని తిట్టినపుడు మీకు కోపం వస్తుంది కదా. 30 ఏళ్లు వచ్చాక కూడా మీరు ఇంకొకరితో పోల్చుకుని బతుకుతుంటే ఆ కోపానికి అర్థం ఏముంది. అందుకే వేరొకరితో పోల్చుకోకుండా కసితో కష్టపడండి. ఓ గోల్ పెట్టుకుని దానికోసం కృషి చేయండి.
30 ఏళ్ల వయసు దాటాక బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు వంటి అనేక రోగాలు ఒకటొకటిగా చుట్టుముడుతుంటాయి. దీనికి మీరు పాటించే జీవనశైలి అలవాట్లు, తినే ఆహారం కారణం. అందుకే 30 ఏళ్లు వచ్చాక డైట్ విషయంలో కఠినంగా ఉండండి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి వద్దు. జంక్ ఫుడ్ బదులు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాయామం చేయండి. రోజూ 8 గంటలు నిద్రపోండి.
ప్రతి ఒక్కరికీ అన్నీ ఉండవు. డబ్బు, మంచి ఉద్యోగం, ఆరోగ్యం.. ఇందులో ఏదో ఒక దగ్గర లోపం ఉండే ఉంటుంది. కాబట్టి అన్నీ సవ్యంగా ఉన్నపుడే చేస్తా అని పనులు వాయిదా వేయకండి. ఎన్ని కష్టాలు ఉన్నా మీ లక్ష్యం కోసం పనిచేయండి. సమయం పట్టినా మీ భవిష్యత్ మాత్రం చాలా బాగుంటుంది.
చాలామంది రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కానీ గుంపులో బతకడం కంటే ముందడుగు వేసి రిస్క్ తీసుకునే వారినే అదృష్టం వరిస్తుంది. కాబట్టి 30 ఏళ్లు వచ్చినా ఇక అయిపోయిందిలే జీవితం అని కంఫర్ట్ జోన్లో ఉండకుండా రిస్క్ తీసుకోండి. కెరీర్ కచ్చితంగా బాగుంటుంది.
మిమ్మల్ని పట్టించుకోని, మీకు విలువ ఇవ్వని వారితో సమయాన్ని వృథా చేయకండి. ఇలాంటి వారికి నో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీ సమయం, డబ్బు అన్నీ ఆదా అవుతాయి. జీవితం కూడా సాఫీగా సాగుతుంది.
మీకు సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయడానికి ముందుండండి. పాజిటివ్ వ్యక్తులతో గడపండి. దీనివల్ల మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. జీవితంలో సమస్యలు ఉన్నా కూడా ఓ పాజిటివ్ ఆలోచనతో ముందుకెళతారు.
30 ఏళ్లు వచ్చి ఉద్యోగం, పెళ్లి వంటి బాధ్యతలతో ఉన్నవారు ఇక అక్కడే ఆగిపోతారు. కానీ ఇలా చేయడం వల్ల మీ అభివృద్ది కూడా ఆగిపోతుంది. కాబట్టి పెళ్లి అయినా, పిల్లలు ఉన్నా కూడా మీ నైపుణ్యాలపై మరింత ఫోకస్ పెట్టండి. మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటేనే మీ భవిష్యత్ బాగుంటుందని అర్థం చేసుకోండి.