
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ACB Operation With Farmer: వ్యవసాయం చేసుకునే రైతు తన పొలానికి చెరువు నుంచి మట్టి తోలుకునేందుకు సాగునీటి ఇంజనీర్‌ను సంప్రదించగా.. అతడు పెద్ద ఎత్తున లంచం ఆశించాడు. పొలం పనులు చేసుకునే రైతుకు భారీ స్థాయిలో లంచం ఇచ్చుకునే స్తోమత లేదు. దీంతో అతడు వెంటనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల ఆదేశాలతో లంచంగా డబ్బులు ఇచ్చాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. అయితే ఆ రైతు ఇప్పటికే ఒక అధికారిని ఏసీబీకి పట్టించగా.. తాజాగా రెండో అధికారిని కూడా ఏసీబీకి అప్పగించాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈ ఎల్. శ్రీనివాస్ రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి ఓ రైతు తన పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి కోరగా.. ఏఈఈ శ్రీనివాస్ రూ.రెండు లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తూ రైతు ఏసీబీ అధికారులకు పట్టించాడు.
మట్టి తోలుకునేందుకు అశ్వారావుపేటలోని ఏఈ తన కార్యాలయంలో రైతు నుంచి రూ.రెండు లక్షల నగదు స్వీకరిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఏఈఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. '2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. దొంతికుంట చెరువు నుంచి రైతు పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి అడగ్గా ఏఈఈ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు' అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు అవినీతి నిరోధక శాఖ ఖమ్మం జిల్లాలో వరుసగా దాడులు చేస్తుండడంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఏ కార్యాలయంలో ఎలాంటి రైడ్స్ అవుతాయా? తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పనులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు నిజాయతీగా అమలు చేయాల్సి ఉండగా.. కొందరు డబ్బులు ఆశిస్తూ లంచాలకు అలవాటు పడడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో కార్యాలయాలపై ఏసీబీ పంజా విసురుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
శభాష్ రైతన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై ఓ రైతు ఉద్యమం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తనకు అడుగడుగునా ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఆశిస్తుండడంతో వారికి బుద్ధి చెప్పేందుకు ఏసీబీతో కలిసి భారీ ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ రైతు ఇద్దరు అధికారులను ఏసీబీకి పట్టించారు. గతంలో విద్యుత్ శాఖ అధికారిని, నేడు ఇరిగేషన్ శాఖ అధికారిని రైతు పట్టించడం విశేషం. మరి ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతుండడంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి అవినీతి లేకుండా పనులు చేసేందుకు సిద్ధమైంది.