
రామ్ పోతినేని(Ram Pothineni) కెరీర్లో కీలక నిర్ణయం తీసుకుంటూ నిర్మాతగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
తన సొంత నిర్మాణ సంస్థ రాపో సినిమాటిక్స్(RAPO Cinematics) బ్యానర్‌పై రూపొందుతున్న RAPO23 సినిమాను స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. షూటింగ్ కూడా వెంటనే మొదలుకాగా, అన్ని కార్యక్రమాలు అనుకున్నట్లుగా పూర్తైతే ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. నిర్మాణ బాధ్యతలను రామ్ సోదరుడు కృష్ణ చైతన్య పర్యవేక్షించనున్నారు.
ఇప్పటివరకు రామ్ నటించిన పలు సినిమాలను అతని పెదనాన్న, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్(Sravanthi ravikishore) నిర్మించారు. రెడీ(Ready), నేను శైలజ(Nenu Sailaja) వంటి సక్సెస్‌లతో పాటు గణేష్(Ganesh), ఎందుకంటే ప్రేమంట(Endukante Premanta), మసాలా(Masala), శివమ్(Shivam), ఉన్నది ఒకటే జిందగీ(Vunnadhi Okate Zindagi), రెడ్(RED) వంటి సినిమాలు కూడా రామ్ హోమ్ బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ బ్యానర్ లోనే వచ్చాయి. గత కొన్నేళ్లుగా రామ్ కోసం కొత్త కథలపై ప్రయత్నాలు జరిగినప్పటికీ, రెగ్యులర్ కథలకు ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరోవైపు మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో పెద్ద రిస్క్‌లు తీసుకోవడంపై రవి కిషోర్ కూడా అంతగా ముందుకు రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త తరహా కథలతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో రామ్ ప్రత్యేకంగా రైటర్లు, టెక్నీషియన్లతో ఓ కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నెలల తరబడి జరిగిన స్టోరీ డిస్కషన్స్ అనంతరం తన ఆలోచనలకు అనుగుణంగా సినిమాలను నిర్మించేందుకు రాపో సినిమాటిక్స్ ను స్థాపించినట్లు సమాచారం. ఈ బ్యానర్ ద్వారా తన విజన్‌కు తగ్గ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త ప్రయాణానికి స్రవంతి రవి కిషోర్ చీఫ్ గెస్ట్ గా హాజరై తన మద్దతు తెలియజేయడం విశేషంగా మారింది.