
న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. సోమవారం ఆయన పదవీకాలం ముగియడంతో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఆయన సేవలను కొనియాడిన సీజే జస్టిస్ లీసా గిల్
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. సోమవారం ఆయన పదవీకాలం ముగియడంతో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ రఘునందనరావు ఎన్నో చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారని, దాదాపు 25వేల కేసులు పరిష్కరించారని ప్రశంసించారు. ఆయన సేవలను అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్‌రెడ్డి తదితరులు కొనియాడారు. న్యాయమూర్తిగా ఆరున్నరేళ్ల సర్వీసు సంతృప్తినిచ్చిందని జస్టిస్ రఘునందనరావు చెప్పారు. గత రెండేళ్లుగా హైకోర్టు వందశాతం కేసులు పరిష్కరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ గంగారావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్, జస్టిస్ రఘునందనరావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, ఏఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలోనూ జస్టిస్ ఆర్.రఘునందనరావు, రాజిత దంపతులను ఘనంగా సన్మానించారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.