తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు, కానుకల్ని అందజేస్తున్నారు. గత రెండేళ్లలో భక్తులు స్వామివారి పేరుతో టీటీడీ నిర్వహించే ట్రస్టులకు, అలాగే చెల్లించే కానుకలు పెరుగుతున్నాయి.
ఇటీవలి కాలంలో టీటీడీ ట్రస్టులకు భక్తుల నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ బర్డ్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్, శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ట్రస్టులకు విరాళాలు ఇచ్చే భక్తులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ (80G) కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. తాజాగా టీటీడీకి హైదరాబాద్‌కు చెందిన సంస్థ భారీ విరాళం అందజేసింది. హైదరాబాద్‌కు చెందిన లేవేన్ హోల్డింగ్స్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు భారీ విరాళం అందజేసింది. లేవేన్ హోల్డింగ్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ వెంకట రవికుమార్ రూ.1.10 కోట్లు విరాళాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళాల డీడీలను అందజేశారు. ఈ విరాళంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతను అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.తిరుమలలో గరుడ సేవతిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.తిరుచానూరు తెప్పోత్సవాలుతిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా ముగిశాయి. ఐదవ రోజు శ్రీ పద్మావతీ అమ్మవారు పద్మసరోవరంలో అలంకృత తెప్పపై ఏడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చనలను నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని వైభవంగా చేపట్టారు. సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మసరోవరం వద్దకు వేంచేపు చేయగా, అనంతరం తెప్పోత్సవం భక్తుల గోవింద నామస్మరణల మధ్య భక్తిరసపూరితంగా జరిగింది. తెప్పోత్సవం అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ దివ్యోత్సవాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.