
Financial changes | ఇంటర్నెట్ డెస్క్: జులై 1 నుంచి ఆర్థిక అంశాలకు సంబంధించి పలు మార్పులు రాబోతున్నాయి. పాస్‌పోర్టు ఫీజులు పెరగబోతున్నాయి.
ఎస్బీఐ- ఫోన్‌పే క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువూ ఈ నెలలోనే ముగియనుంది. ఆ వివరాలు ఇవీ..
ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నుల దాఖలు గడువు జులై 31తో ముగియనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి దాటిన ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డెడ్‌లైన్‌లోపు రిటర్నలు దాఖలు చేయకుంటే పెనాల్టీ చెల్లించాలి.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తన మొబైల్ యాప్‌లో ఇ-మెయిల్ అప్డేషన్పై రుసుములు తొలగించింది. ప్రస్తుతం ఇ-మెయిల్ ఐడీ అప్డేషన్ కోసం రూ.75 చొప్పున ఫీజు వసూలు చేస్తుండగా.. జులై 1 నుంచి ఆరు నెలల పాటు అంటే 2026 డిసెంబర్ 31వరకు ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని ఉడాయ్ కల్పిస్తోంది.
జులై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజులు పెరగబోతున్నాయి. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్ రుసుమును రూ.1500 నుంచి రూ.2,500 పెంచింది. తత్కాల్ ఫీజును రూ.3,500 నుంచి రూ.5 వేలకు సవరించింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.2 వేల నుంచి రూ.3500 పెంచారు. తత్కాల్ ఫీజును రూ.6 వేలుగా నిర్ణయించారు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్ట్ రుసుము ప్రస్తుతం రూ.1000 ఉండగా.. దీనిని రూ.1750కి చేర్చారు.
ఫోన్‌పే- ఎస్బీఐ కార్డ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ ప్రోగ్రామ్‌లో ఎస్బీఐ కార్డ్ మార్పులు చేసింది. ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ రివార్డు పాయింట్లకు కొత్త పరిమితులను నిర్దేశించింది. జులై 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మార్పులు ఇవే...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రాములో మార్పులు చేసింది. త్రైమాసికంలో కనీసం రూ.60వేలు ఖర్చు చేసిన వారికే తదుపరి నెల ఉచిత లాంజ్ యాక్సెస్ కల్పించేలా మార్పులు చేసింది. ఈ నిబంధన కూడా జులై 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చాయి. పెరిగిన ఎల్పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరట కల్పించేలా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలను సమీక్షించి ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను ఆయా సంస్థలు సవరిస్తుంటాయి. ఈసారి అలాంటి ఊరట ఉంటుందేమో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.