
టాలీవుడ్లో మరో సంచలన ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. వీరి కాంబినేషన్లో రాబోతున్న రెండో సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది.
కార్తికేయుడి కథతో సినిమా రూపొందనుంది. తాజాగా దీన్ని ప్రకటించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందనుంది. ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించనున్నారు. ఈ సోమవారం సాయంత్రం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఇందులో `శివుని కుమారుడు, పార్వతీదేవి గర్వకారణం, శాశ్వత సేనాని` అనే క్యాప్షన్‌తో ఈ సినిమాని ప్రకటించడం విశేషం. ఇది అంచనాలను పెంచుతోంది.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ పూనకాలు తెప్పిస్తుంది. యుద్ధభూమి కనిపిస్తుంది. కార్తికేయుడి ఆయుధం కనిపిస్తోంది. వేల మంది సైనికులు వీరమరణం పొందారు. లుక్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సినిమా గురించి టీమ్ చెబుతూ, విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు, ఒక అసాధారణమైన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం దైవిక నేపథ్యంతో రూపుదిద్దుకోనుంది. పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించనుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి, త్రివిక్రమ్ కలం బలానికి తోడుగా ఈ దైవిక కథాంశం తోడవ్వడం సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తోంది.
ఈ చిత్రం కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో, పాటలతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రానికి ఆయన అందించే సంగీతం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ ప్రపంచస్థాయి భారీ చిత్రాన్ని నిర్మించడానికి అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడు–దర్శకుడు కలయికల్లో ఒకటైన ఎన్టీఆర్–త్రివిక్రమ్ జోడీ, రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయి దృశ్యకావ్యాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాం` అని టీమ్ తెలిపింది.