
1947 లో భారత ఉపఖండ విభజన జరిగిన సమయంలో నాటి పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ప్రాంతాలలో గణనీయమైన సంఖ్యలో ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం నామమాత్రపు స్థాయికి పడిపోవడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర...
1947 లో భారత ఉపఖండ విభజన జరిగిన సమయంలో నాటి పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ప్రాంతాలలో గణనీయమైన సంఖ్యలో ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం నామమాత్రపు స్థాయికి పడిపోవడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్య సమయంలో పాకిస్తాన్లో దాదాపు 27 శాతం, బంగ్లాదేశ్ (నాటి తూర్పు పాకిస్తాన్)లో సుమారు 33 శాతంగా నమోదైన హిందువుల జనాభా.. ప్రస్తుతం వరుసగా 1.6 శాతం, 7.9 శాతానికి క్షీణించింది. ఈ భారీ పతనం అనేది కేవలం ప్రకృతిసిద్ధమైన జనాభా మార్పుల వల్ల జరిగింది కాదనీ, దశాబ్దాలుగా ఆయా దేశాలలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలు, చట్టపరమైన వివక్ష, మతపరమైన వేధింపులు, ఆస్తుల అపహరణ, బలవంతపు మతమార్పిడుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వివిధ చారిత్రక ఆధారాలు, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పాకిస్థాన్ ఏర్పడిన తొలినాళ్లలో సమాన హక్కుల గురించి వాగ్దానాలు చేసినప్పటికీ.. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు తలెత్తాయి. 1949లో ఆమోదించిన ఆబ్జెక్టివ్స్ రెజొల్యూషన్ ద్వారా ఆ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించడంతో మైనారిటీల హక్కుల క్షీణతకు పునాది పడింది. ముఖ్యంగా 1970వ దశకం చివర్లో జనరల్ జియా-ఉల్-హక్ నాయకత్వంలో ప్రారంభమైన తీవ్ర ఇస్లామీకరణ ప్రక్రియ ఆ దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థలను మార్చివేసింది. హుదూద్ ఆర్డినెన్సులు, కఠినమైన బ్లేస్ఫెమీ (మత దూషణ) చట్టాలు ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన ఆయుధాలుగా మారాయి. పాఠ్యపుస్తకాలలో హిందువులను వ్యతిరేకులుగా చిత్రించడం, మదర్సాల విస్తరణ ద్వారా మతపరమైన తీవ్రతను పెంచడం వంటి చర్యలు మైనారిటీల మనుగడను మరింత క్లిష్టతరం చేశాయి. లాహోర్, కరాచీ వంటి చారిత్రక నగరాల్లో ఒకప్పుడు సగానికి పైగా ఉన్న హిందూ పౌరుల సంఖ్య నేడు దాదాపు జీరోకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.
మరోవైపు బంగ్లాదేశ్‌లో కూడా హిందూ మైనారిటీల పరిస్థితి తీవ్రంగా దిగజారింది. 1971 విముక్తి యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం జరిపిన అమానుష హత్యాకాండలో హిందువులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. నాటి ఆపరేషన్ సర్చ్‌లైట్ లో లక్షలాది మంది హిందువులు ప్రాణాలు కోల్పోగా, కోటి మందికి పైగా శరణార్థులుగా భారతదేశానికి వలస వచ్చారు. చుక్నగర్ వంటి ప్రాంతాలలో జరిగిన నరమేధం, లక్షలాది మంది మహిళలపై జరిగిన అరాచకాలు చారిత్రలో బ్లాక్ డేస్ గా మిగిలిపోయాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నాటి 'ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్' (ప్రస్తుత వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్) ద్వారా హిందువుల కోట్లాది ఎకరాల భూములను చట్టబద్ధంగా జప్తు చేయడం జరిగింది. దీనివల్ల ఆర్థికంగా కుంగిపోయిన ఎన్నో లక్షల కుటుంబాలు దేశాన్ని వదిలి వెళ్లక తప్పలేదు. 1975 తర్వాత జరిగిన రాజ్యాంగ సవరణల ద్వారా బంగ్లాదేశ్ లౌకిక స్వభావాన్ని కోల్పోయి, ఇస్లాంను అధికారిక మతంగా స్వీకరించడం మైనారిటీల అభద్రతా భావాన్ని మరింత పెంచింది.
ఈ దేశాలలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, వేధింపులు నేటికీ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌లోని సింధ్ వంటి ప్రాంతాలలో ప్రతి ఏటా వందలాది మంది మైనారిటీ యువతులను అపహరించి, బలవంతంగా మతమార్పిడులు చేసి వివాహాలు జరిపిస్తున్న ఉదంతాలు నిరంతరాయంగా నమోదవుతున్నాయి. చారిత్రక దేవాలయాల ధ్వంసం, మత దూషణ ఆరోపణలతో న్యాయస్థానాలతో సంబంధం లేకుండా గుంపులుగా దాడి చేసి ప్రాణాలు తీయడం వంటి ఘటనలు సాధారణమయ్యాయి. అదేవిధంగా.. బంగ్లాదేశ్‌లో 2024లో సంభవించిన రాజకీయ మార్పుల అనంతరం హిందువుల ఇళ్లు, దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. హిందూ హక్కుల కోసం పోరాడుతున్న ఆధ్యాత్మిక నేతల అరెస్టులు, ఇస్కాన్ వంటి సంస్థలపై నిషేధానికి డిమాండ్లు రావడం అక్కడ మారుతున్న క్లిష్ట పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఈ క్రమపతనం, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం, అమెరికా, బ్రిటన్ పార్లమెంట్లు వివిధ సందర్భాల్లో దక్షిణాసియాలోని మైనారిటీల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా విదేశాంగ శాఖ పాకిస్తాన్‌ను మత స్వేచ్ఛ ఉల్లంఘనల ప్రత్యేక ఆందోళన జాబితాలో నిరంతరం చేర్చుతూనే ఉంది. చట్టపరమైన వైరుధ్యాల వల్ల స్థానిక న్యాయస్థానాలు సైతం మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పించలేకపోతున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. మైనారిటీల స్వరాన్ని నొక్కేయడం, హక్కుల కోసం మాట్లాడే నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వంటివి ఈ దేశాల్లో పరిపాటిగా మారాయి.
ఈ సుదీర్ఘ అణచివేతకు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఇది కేవలం తక్షణ రాజకీయ పరిణామాల వల్ల కాకుండా, వ్యవస్థాగతంగా లోతుగా నాటుకుపోయిన ద్వేషపూరిత ప్రచారం వల్లనే సాధ్యమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, చిన్నతనం నుంచే ఇతర మతాల పట్ల అసహనాన్ని నూరిపోయడం వల్ల సమాజంలో సామరస్యం దెబ్బతింది. రాజకీయ పార్టీలు మైనారిటీలను తమ ఓటు బ్యాంకుగా లేదా రాజకీయ బలిపశువులుగా వాడుకోవడం వల్ల వారికి శాశ్వత రక్షణ లభించలేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మైనారిటీల భద్రత విషయంలో ఎలాంటి సానుకూల మార్పులు రాకపోవడానికి ఈ వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణం.
పొరుగు దేశాలలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఆయా దేశాలకే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిరంతర మత హింస, ఆర్థిక సామాజిక వేధింపుల కారణంగా లక్షలాది మంది హిందువులు శరణార్థులుగా భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర వంటి ప్రాంతాలకు వలస రావడం వల్ల ఆయా రాష్ట్రాలపై అపారమైన ఆర్థిక, జనాభా ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ సమాజం తమ వ్యూహాత్మక భౌగోళిక ప్రయోజనాల కోసం ఈ మానవతా సంక్షోభాన్ని ఆశించిన స్థాయిలో ప్రశ్నించకపోవడం వల్ల బాధితులకు సరైన న్యాయం జరగడం లేదనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి.
భవిష్యత్తులో ఈ దేశాలలో మైనారిటీల మనుగడ సాధ్యం కావాలంటే తక్షణమే చట్టపరమైన, సామాజిక మార్పులు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వివాదాస్పద మత దూషణ చట్టాలను దుర్వినియోగం కాకుండా నిరోధించడం, వివాదాస్పద ఆస్తుల జప్తు చట్టాలను సవరించడంతో పాటు, అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించే నూతన చట్టాలను తీసుకురావాల్సి ఉంది. పాఠ్యపుస్తకాలు, విద్యాసంస్థల నుండి ద్వేషపూరిత బోధనలను తొలగించి, మతసహనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ ప్రాంతాలలో నిరంతర పర్యవేక్షణ సాగించి, బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలి. అప్పుడే దశాబ్దాలుగా సాగుతున్న ఈ జనాభా స్థానభ్రంశానికి అడ్డుకట్ట పడి, మైనారిటీలకు గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది.
బ్రెటన్ వుడ్స్, 1944.. డాలర్‌ను రాజుగా చేసిన ఒప్పందం
.