
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ -జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాగైనా సరే మళ్లీ పాగా వేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ గట్టిగా ట్రై చేస్తోంది.
ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు రెండేళ్లపాటు పెద్దగా జనంలోకి రాని గులాబీ శ్రేణులు.. ఇప్పుడు మాత్రం రూట్ మార్చాయి. రోజువారీగా ప్రజల్లో ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కేడర్‌లో కొత్త జోష్ నింపుతున్నారు.
బీఆర్ఎస్ అగ్రనాయకత్వం జీహెచ్ఎంసీపై ఇంతలా ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోనే ఏకంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న శివారు నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 35 కి చేరుకుంటుంది. అంటే, రాష్ట్ర అధికార పీఠాన్ని శాసించడంలో దాదాపు మూడో వంతు బలం ఒక్క గ్రేటర్ పరిధిలోనే దాగి ఉందన్నమాట.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే ఊపును రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కొనసాగించి, ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీని గనుక మట్టికరిపించగలిగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే అని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తోంది. ఇక్కడ సాధించే విజయం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి గట్టి పునాది వేయవచ్చనేది కేటీఆర్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా కేటీఆర్ హైదరాబాద్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కేవలం పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, నేరుగా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ స్థానిక లీడర్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. ఎన్నికల సమరానికి క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి సమీక్షల్లో అటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే, ఇటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన SIRపై పార్టీ శ్రేణులకు, ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్.. కేటీఆర్ దూకుడుతో ఇప్పుడు రూట్ మార్చింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రోజూ జనంలో ఉండేందుకే స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్లీ గల్లీలో పర్యటిస్తూ, ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కేవలం కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందనే విషయాన్ని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నగరం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తానికి హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు. ఒకవైపు 24 నియోజకవర్గాల అండ, మరోవైపు కేటీఆర్ దూకుడుతో గ్రేటర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ పట్టు నిలుపుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ బీఆర్ఎస్ హవా సృష్టించాలనే ‘రివర్స్ స్కెచ్’ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కేటీఆర్ వ్యూహాత్మక కొట్లాట అధికార కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగా పెద్ద సవాల్‌గా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.