
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తుంటే, బయట మాత్రం చిత్రవిచిత్రమైన జోష్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఘనా దేశానికి చెంది
న ప్రముఖ, వివాదాస్పద మంత్రగాడు నానా క్వాకు బోన్సామ్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌పై చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా జట్టును కేప్ వెర్దె ఓడించి టోర్నమెంట్ నుంచి బయటకు పంపుతుందని ఆయన సంచలన జోస్యం చెప్పారు.
ఘనాకు చెందిన జోతిష్యుడు నానా క్వాకు బోన్సామ్ అంచనా ప్రకారం.. రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు కోలుకోలేని షాక్ తగలనుంది. "నాకౌట్ స్టేజ్‌లో మెస్సీ అర్జెంటీనాను టోర్నమెంట్ నుండి బయటకు పంపే జట్టు కేప్ వెర్దె మాత్రమే" అని కామెంట్స్ చేశారు. జూన్ 4వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు అర్జెంటీనా, కేప్ వెర్దె జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ ఛాంపియన్‌గా నిలిచి అర్జెంటీనా నాకౌట్‌కు దూసుకొచ్చింది.
జోర్డాన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో మెస్సీ ఫ్రీ-కిక్ గోల్‌తో సహా అర్జెంటీనా 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో మెస్సీ వరుసగా ఏడు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, మిరోస్లావ్ క్లోజ్ వరల్డ్ కప్ గోల్స్ రికార్డును కూడా మెస్సీ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం 6 గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న మెస్సీ జట్టు ఓడిపోతుందని చెప్పడం అభిమానులకు షాక్ ఇస్తోంది.
అర్జెంటీనా ఓడిపోతుందని చెప్పడమే కాకుండా, ఈసారి 2026 ఫిఫా వరల్డ్ కప్‌ను క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ జట్టు గెలుచుకుంటుందని బోన్సామ్ బోల్డ్ ప్రిడిక్షన్ ఇచ్చారు. ఫుట్‌బాల్ మైదానం కంటే ముందే ఆధ్యాత్మిక ప్రపంచంలో పోర్చుగల్ విజయం ఖరారైపోయిందని ఆయన వాదిస్తున్నారు. "ఈ వరల్డ్ కప్ పోర్చుగల్, క్రిస్టియానో రొనాల్డోదే. వాళ్లే కప్ కొడతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్లు ఇప్పటికే గెలిచేశారు. రొనాల్డో నమ్మకంగా ఉండొచ్చు, ఎందుకంటే అతని సమయం వచ్చేసింది" అని బోన్సామ్ చెప్పుకొచ్చారు.
నానా క్వాకు బోన్సామ్ కేవలం ప్రవచనాలకే పరిమితం కాలేదు. అంతకుముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌ను టార్గెట్ చేసి వార్తల్లో నిలిచారు. ఘనాతో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ కేన్ గోల్ చేయకుండా ఉండేందుకు తాను మంత్రాలను ఉపయోగించానని ఆయన చెప్పారు. మ్యాచ్‌కు ముందు ‘డైలీ స్టార్’ పత్రికతో మాట్లాడుతూ.. "నా పవర్ ఏంటో నాకు తెలుసు, అతన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు" అని అన్నారు. ఇంగ్లాండ్, ఘనా మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో హ్యారీ కేన్ వచ్చిన మంచి అవకాశాలను కూడా మిస్ చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో బోన్సామ్ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.
అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని బోన్సామ్ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. "హ్యారీ కేన్ నా శత్రువు ఏమీ కాదు. త్వరలోనే నా పుట్టబోయే బిడ్డకు హ్యారీ కేన్ అని పేరు పెడతాను" అని అన్నారు. అంతేకాదు, హ్యారీ కేన్‌ను తన మంత్రాల నుండి విడుదల చేస్తున్నానని, తర్వాతి మ్యాచ్‌లో అతను గోల్స్ చేయవచ్చని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
ఘనా దేశంలో నానా క్వాకు బోన్సామ్ అత్యంత వివాదాస్పద పబ్లిక్ ఫిగర్. అక్రా నగరంలో మూడు ఆధ్యాత్మిక కేంద్రాలను నడుపుతున్న ఆయన, తనను తాను ఆఫ్రికన్ సాంప్రదాయ పూజారిగా, హెర్బలిస్ట్‌గా చెప్పుకుంటారు. 1992లో గ్యాస్ సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడిన తర్వాత ఆయన ఈ ఆధ్యాత్మిక, మంత్రవిద్యల వైపు తిరిగారు. ఘనా స్థానిక నమ్మకాలు, సాంప్రదాయ పద్ధతులను అనుసరించే ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది.
గతంలో 2014 ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా ఘనాతో మ్యాచ్‌కు ముందు క్రిస్టియానో రొనాల్డో గాయపడటానికి తానే కారణమని క్లెయిమ్ చేసి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేకపోయినా, సోషల్ మీడియా యుగంలో ఫుట్‌బాల్ లవర్స్ మాత్రం ఈ అంచనాల పై తెగ చర్చించుకుంటున్నారు. మరి మెస్సీని ఓడించి రొనాల్డో కప్ కొడతాడో లేదో చూడాలి.