ఏపీలోని ఓ విద్యార్థినిని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ దుప్పటి అడిగినందుకు బయటకు పంపించారంటూ ప్రచారం జరుగుతోంది. రాత్రి వేళలో విద్యార్థిని తన లగేజ్ తీసుకుని హాస్టల్ నుంచి బయటకు వస్తున్న వీడియో వైరల్...
ఏపీలోని ఓ విద్యార్థినిని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ దుప్పటి అడిగినందుకు బయటకు పంపించారంటూ ప్రచారం జరుగుతోంది. రాత్రి వేళలో విద్యార్థిని తన లగేజ్ తీసుకుని హాస్టల్ నుంచి బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని.. తల్లిదండ్రులు ఆ విద్యార్థినిని ఇంటికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన బాలిక ఇక్కడి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటూ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి బాలిక హాస్టల్లో పడుకునేందుకు దుప్పటి కావాలని వార్డెన్ స్వప్నను అడిగింది. వార్డెన్ ఆగ్రహింతో సిబ్బందికి చెప్పి విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేయించి హాస్టల్లో సీటు లేదని వెంటనే బాలికను ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు.వెంటనే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందో ఆరా తీశారు. తమ కూతురు హాస్టల్లో ఉండేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. కానీ వార్డెన్ మాత్రం బాలికను ఇంటికి పంపించేశారు. గత మూడేళ్లుగా తమ కుమార్తె ఇదే హాస్టల్లో చదువుతోందని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెయ్యి విరగడంతో ఇంటికి తీసుకెళ్లామన్నారు. బాలికను ఇటీవల హాస్టల్లో వదిలి వెళ్లామంటున్నారు తండ్రి. అయితే విద్యార్థినిని రాత్రిపూట ఇంటికి పంపడం సరికాదని.. ఈ ఘటనపై విచారణ జరుపుతామని అధికారులు చెప్పారు. తాజాగా ఈ చింతలపూడి హాస్టల్లో విద్యార్థినికి సంబంధించిన అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని అర్ధరాత్రి గెంటేసిన వార్డెన్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోందన్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని.. గత ఏడాది ఇదే హాస్టల్లో ఉన్న అక్షయ అనే 8వ తరగతి విద్యార్థినికి ఈ ఏడాది చింతలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోలేదన్నారు. అందువల్ల హాస్టల్ సీటు కూడా రెన్యువల్ అవ్వలేదని.. అయినా వార్డెన్ ఆమెను 4 రోజుల పాటు హాస్టల్లో ఉండనిచ్చారన్నారు. చివరకు అడ్మిషన్ కాకపోవడంతో బాలికను ఇంటికి తీసుకెళ్లాలని వార్డెన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారన్నారు. దీంతో తల్లిదండ్రులు రాత్రి వేళకు హాస్టల్‌కు చేరుకోగా.. రాత్రి 8:45 గంటల సమయంలో బాలికను వారితో పాటు ఇంటికి పంపించివేశారన్నారు. ఆ సమయంలో తీసిన వీడియోను తప్పుడు ప్రచారంతో వైరల్ చేశారన్నారు. చింతలపూడి హాస్టల్ ఘటనకు సంబంధించి పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకండి, నమ్మకండని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సూచించింది. ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇలా ఉంటే.. విద్యార్థినిని రాత్రి సమయంలో హాస్టల్ నుంచి బయటకు పంపించినందుకు వార్డెన్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.. ఆమెను సస్పెండ్ చేశారు.