
FIFA World Cup| ఇంటర్నెట్‌డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్ దశకు చేరుకోవాలన్న ఇరాన్ కలలు కల్లలయ్యాయి. ఈ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో చివరి మ్యాచ్ అనంతరం లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు (Iran Football Team) ఉద్వేగపూరిత లేఖను ఉంచింది. వేల సంవత్సరాలుగా విజయం కంటే గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఇరాన్ నుంచి తాము వచ్చామని ఆటగాళ్లు అందులో రాసినట్లుగా ఉంది. ‘‘మా ఉద్దేశంలో ఫుట్‌బాల్ అనేది కేవలం పోటీ మాత్రమే కాదు.. అది వ్యక్తిత్వానికి సంబంధించిన పరీక్ష. పాయింట్లను అనేక విధాలుగా గెలుచుకోవచ్చు, కానీ గౌరవాన్ని అలా సంపాదించలేం. ఏ జట్టయినా గ్రూప్ దశ నుంచి నాకౌట్‌కు చేరుకోవచ్చు.. కానీ కేవలం న్యాయం, గౌరవంతో మాత్రమే ఎవరైనా చరిత్ర ముందు సగర్వంగా నిలబడగలుగుతారు’ అని ఇరాన్ ఆ లేఖలో రాసుకొచ్చింది.
గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఈజిప్టుతో మ్యాచ్ 1-1తో డ్రా అవడంతో ఈ జట్టు తన ప్రయాణాన్ని ముగించింది (Iran leave FIFA 2026). గ్రూప్ స్టేజ్‌లో టాప్-2లో నిలిస్తే నాకౌట్‌కు చేరే అవకాశం ఉంటుంది. కానీ, ఇరాన్ మూడో స్థానంలో ఉండటంతో నేరుగా వెళ్లే ఛాన్స్ లేకపోయింది. ఇక, మూడో స్థానంలో ఉన్న జట్ల మధ్య బెస్ట్ ఆఫ్ 8లోనూ ఇరాన్‌కు చోటు దక్కలేదు. లీగ్ స్టేజ్‌లో చివరిదైన ఆస్ట్రియా- అల్జీరియా మ్యాచ్ 3-3 డ్రాగా ముగియడంతో.. ఈ రెండు బెస్ట్ ఆఫ్ 8లో స్థానం సంపాదించాయి. ఫలితంగా ఇరాన్ జట్టు ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.
టోర్నమెంట్లో భాగంగా ఇరాన్ జట్టుకు వసతి ఏర్పాట్లపై కెప్టెన్ మెహదీ తరేమీ ఫిఫా (FIFA World Cup 2026)పై విమర్శలు గుప్పించారు. అసలు తమకు ఎవరైనా సాయం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. టోర్నీ సమయంలో ఆంక్షల పేరుతో తమ జట్టుకు సరైన వసతి సౌకర్యాలు కల్పించలేదన్నారు. మ్యాచ్‌ల సమయంలో తమ జట్టును అణచివేతకు గురిచేశారని ఇరాన్ కోచ్ ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.