
పెరుగుతున్న అదృశ్యం కేసులు ఈనాడు, హైదరాబాద్ ..ఈ రెండు కేసుల్లో బాలికలకు ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్ ఆడే అలవాటు ఉంది. వీరిలాగే ఎందరో ఈ ఆటతో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
వరుస ఘటనల నేపథ్యంలో ఆన్లైన్ ఆటలు, సామాజిక మాధ్యమాల్లో పిల్లలేం చేస్తున్నారు.. ఎవరితో ఆడుతున్నారనే దానిపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
బాలికలు ఫ్రీ ఫైర్ ఆటతో కాలక్షేపం చేస్తున్నారని తేలిగ్గా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాలు, మాయగాళ్లు కొత్త ఎత్తులతో ఆడపిల్లలకు వల విసురుతున్నారు. ఆన్లైన్ గేమింగ్‌తో అమ్మాయిలకు ఉచ్చు బిగిస్తున్నారు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే సభ్యులకు పరస్పరం మాట్లాడుకునే వెసులుబాటూ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని మైనర్లను ఉచ్చులోకి లాగుతున్నారు. ఇల్లు వదలి బయటకు వచ్చేలా వారిని పురిగొల్పుతున్నారు. బాలికల అదృశ్యం కేసుల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినపుడు ఈ విషయం తెలిసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సంపన్నుల పిల్లలకు స్నేహం పేరిట దగ్గరై.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు వసూలుచేసిన ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసు కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నదమ్ములు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బాలికలను ఈ తరహాలో మోసగించినా.. పరువు పోతుందన్న భయంతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు.
పరిచయం.. స్నేహం.. ప్రేమ పేరిట బాలికలను ఆకట్టుకునేందుకు మాయగాళ్లు ఫ్రీఫైర్ గేమింగ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ యాప్‌లను వేదికగా చేసుకుంటున్నారు. అందులో ఉత్సాహంగా కనిపించే అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక వివరాలు, ఆసక్తులను తెలుసుకుంటారు. ఆటలో మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన ఆయుధాలు కొనేందుకు ఆర్థికంగా సహకరిస్తున్నారు. తమపై నమ్మకం వచ్చాక.. ఫోన్ నంబర్లు తీసుకుని స్నేహం పేరిట దగ్గరవుతున్నారు. తాము చెప్పినట్టు చేస్తే సరదాగా గడపొచ్చని ఇంటి గడప దాటేలా పురిగొల్పుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫొటోలు, వివరాలతో బాలికలకు పరిచయమవుతున్నారు. తమపై జాలి, ప్రేమ, దయ, ఇష్టం కలిగేలా మాయమాటలు చెప్పి క్రమంగా లోబరచుకుంటున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన బాలిక(15)కు ఇన్‌స్టాలో యువకుడు పరిచయమయ్యాడు. తాను ఆపదలో ఉన్నానని.. డబ్బులిస్తే బయటపడతానని ఏమార్చాడు. ఇదంతా నిజమని భావించిన బాలిక బీరువాలో దాచిన రూ.లక్ష చోరీచేసి అతడికి ఇచ్చింది. బాలికను లోబరచుకుని ఏకాంతంగా ఉన్నప్పటి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో నగలు కొట్టేసేలా చేశాడు. తన స్నేహితుడితో కూడా గడపాలని ఒత్తిడి తేవటంతో బాలిక జరిగిన విషయమంతా తల్లిదండ్రులకు చెప్పింది.
-డా.లావణ్యనాయక్ జాదవ్, డీసీపీ, నగర మహిళా భద్రత విభాగం, హైదరాబాద్
ఆన్లైన్ గేమింగ్‌లో బాలికలను ట్రాప్ చేస్తున్న ఘటనలపై దృష్టిసారించాం. మోసగాళ్ల బారినపడకుండా పిల్లలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ గేమ్‌లు, సామాజిక మాధ్యమాలను పిల్లలు చాలా పరిమితంగా ఉపయోగించాలి. ఆన్లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులతో పంచుకోవాలి. అనుమానాస్పద సందేశాలు, బెదిరింపులు ఎదురైతే వారితో చెప్పాలి. పోలీసుల దృష్టికి కూడా తీసుకురావాలి. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో వ్యక్తిగత, కుటుంబ వివరాలు పంచుకోవద్దు. గేమింగ్‌లో సహాయం చేస్తామని, ఇల్లు వదలి రమ్మని చెబితే నమ్మొద్దు. గేమింగ్, సామాజిక మాధ్యమాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ఆన్లైన్ భద్రత, సైబర్ ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించాలి. యాప్స్‌లో పేరెంటల్ కంట్రోల్స్, ప్రైవసీ సెట్టింగ్‌లను ఉపయోగించాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి. రాత్రివేళ ఫోన్ వాడేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.