
ఫిఫా ప్రపంచకప్ 2026లో అసలైన సమరానికి తెరలేచింది. ఉత్కంఠభరితంగా, నాటకీయ పరిణామాల మధ్య సాగిన గ్రూప్ స్టేజ్ శనివారంతో ముగియడంతో టాప్ 32 జట్లు నాకౌట్ పోరుకు సిద్ధమయ్యాయి.
అయితే, విడుదలైన నాకౌట్ షెడ్యూల్ బ్రాకెట్ ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ఫైనల్ వరకు మార్గం సుగమంగా కనిపిస్తుండగా, మరోవైపు యూరప్‌కు చెందిన అగ్రశ్రేణి జట్లన్నీ ఒకేచోట చేరి కఠినమైన సవాల్‌ను ఎదుర్కోబోతున్నాయి.గ్రూప్ స్టేజ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ ప్రతి మ్యాచ్‌లో సగటున రెండు గోల్స్ చొప్పున సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అర్జెంటీనాతో పాటు 2018 విజేత ఫ్రాన్స్, ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో మాత్రమే గ్రూప్ దశలో వంద శాతం విజయాలు నమోదు చేశాయి. ఫ్రాన్స్ తరఫున కిలియన్ ఎంబాపె, ఉస్మాన్ డెంబెలె గోల్స్‌తో రాణించారు.మరోవైపు, 2014 ఛాంపియన్ జర్మనీ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో ఓడిపోవడం నిరాశపరిచింది. టోర్నీని 7-1 భారీ విజయంతో ఆరంభించినప్పటికీ ఈ ఓటమి ఆ జట్టును దెబ్బతీసింది. బ్రెజిల్, పోర్చుగల్, ఇంగ్లండ్, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ వంటి జట్లు కూడా గ్రూప్ స్టేజ్ ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తితో లేవు.అర్జెంటీనాకు ఫైనల్ దారి సుగమంనాకౌట్ డ్రాను విశ్లేషిస్తే.. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఫైనల్ చేరేందుకు మార్గం చాలా సులువుగా కనిపిస్తోంది. రౌండ్ ఆఫ్ 32లో అర్జెంటీనా కేప్ వెర్డెతో తలపడనుంది.