
ఇంటర్నెట్ డెస్క్: పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా (Team India Lost) కోల్పోయింది. దీంతో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
చిన్న జట్టు అనే ఉదాసీనతే టీమ్ఇండియా ఓటమికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం భారత్‌పై విమర్శల ఎక్కుపెట్టారు. జట్టులో యువ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నాసరే.. ఐర్లాండ్‌ను చిత్తు చేయడంలో టీమ్ఇండియా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ జట్టు చేతిలో తొలిసారి భారత్ టీ20 సిరీస్‌ను (india vs Ireland) ఓడిపోయింది.
‘‘ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ చాలా తేలికగా తీసుకుంది. భోజనంలో పచ్చడిలా భావించింది. ఇంగ్లాండ్‌తో (India vs England) సిరీస్‌కు ముందు తొలి దెబ్బ తగిలింది. పచ్చడిలో ఘాటు కాస్త ఎక్కువైనట్లు ఉంది. టీమ్ఇండియా చరిత్రలోనే అతి భయంకరమైన ఓటమి ఎదురైంది. అతి విశ్వాసం ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాదు. ఐర్లాండ్‌తో భారత జట్టు ఇలానే ఆడింది. ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పుకాదు. కానీ, ఓవర్కాన్ఫిడెన్స్ చాలా ప్రమాదకరం. టీ20 ప్రపంచకప్‌ను గెలిచాం. రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అయినా, ఐర్లాండ్ చేతిలో అభాసుపాలయ్యాం. తొలి మ్యాచ్‌లో క్యాచ్‌లను డ్రాప్ చేశారంటే సరేలే అని సర్దిచెప్పాం. రెండో టీ20లో తక్కువ స్కోరు ఉన్నా సరే.. విజయం సాధించడంలో వెనుకబడిపోయాం. ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. బ్యాటింగ్‌లో బాధ్యత తీసుకొనేవారు తగ్గిపోయారు. ఐపీఎల్లో చాలా మంది ఫీల్డింగ్ చేయకుండా ‘ఇంపాక్ట్ రూల్’తో తప్పించుకున్నారు. అదే ఇప్పుడు కొంపముంచింది’’ అని మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ వ్యాఖ్యానించాడు.
‘‘జట్టులో ఒకరిద్దరు ఆడితే విజయాలు వరించవు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మరీ ముఖ్యంగా షాట్ల ఎంపిక అత్యంత దారుణం. తొమ్మిదో నంబర్ వరకూ బ్యాటింగ్ చేయగల జట్టు మనది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ 180+ స్కోరు చేయగలిగింది. కానీ, మనం అక్కడి వరకూ వెళ్లలేకపోయాం. ఇప్పుడు రెండో టీ20లో బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్‌ను 150+కే కట్టడి చేశారు. కానీ, టాప్ ఆర్డర్ దారుణమైన ప్రదర్శనతో ఓటమిని కొనితెచ్చుకున్నాం. తిలక్, హర్షిత్ రాణా మినహా ఎవరూ ప్రభావం చూపించలేదు. ఆఖర్లో వచ్చిన ప్రిన్స్ కూడా సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, మిగతా బ్యాటర్లు మాత్రం బాధ్యతగా ఆడలేదు’’ అని ఆకాశ్ చోప్రా విమర్శించాడు.
‘‘తొలి మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ బాగా ఆడలేదు. గతంలో రోహిత్, సూర్యకుమార్ విషయంలో కఠినంగా వ్యవహరించిన మేనేజ్మెంట్ ఈసారి మాత్రం ఉదాసీనంగా ప్రవర్తించింది. ఐపీఎల్, శ్రీలంకలో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు. వరల్డ్ కప్‌లో గెలిచిన జట్టుతోనే మేం బరిలోకి దిగుతామని చెప్పిన లాజిక్ సరిగ్గా లేదు. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు తుది జట్టులో స్థానం కల్పించాల్సింది. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత అతడిని సారథ్యం నుంచి తప్పించారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని అప్పుడు చెప్పారు. సూర్యకుమార్ విషయంలోనూ అంతే. టీ20 ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ అతడు. అతడిని తప్పించినప్పుడు, మరి 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు? భవిష్యత్తు కోసం ఆలోచన చేసేటప్పుడు బాగా ఆడేవారిని దింపాలి కదా..’’ అని మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.