
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం మొదలైతే... దాని ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ల నుంచి చమురు వరకు... చమురు నుంచి బంగారం వరకు... ప్రతి రంగంపైనా దాని ప్రభావం కనిపిస్తుంది.
ఇప్పుడు మరోసారి పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారుతోంది. కాల్పుల విరమణపై ఆశలు కనిపించినా, పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. తాజా దాడులు, ప్రతిదాడులతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామాలు బంగారం ధరలపైనా స్పష్టంగా ప్రభావం చూపిస్తున్నాయి.
సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ముడి చమురు ధరలు పెరిగే అవకాశం, డాలర్ బలపడే అంచనాలు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు... ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ఒత్తిడిని తీసుకొచ్చాయి.
అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో మార్కెట్లు కదులుతున్నాయి. చమురు ఖరీదు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో అమెరికా డాలర్ బలపడే పరిస్థితి ఏర్పడుతుంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం కొనుగోలు కొంత మందగిస్తుంది. అదే ఇప్పుడు ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.930 తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,43,020కు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.1,31,100 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బంగారం ధరలు తగ్గినా వెండి ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద ట్రేడవుతోంది.
ఇక ముందున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయనేది పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఒకరకమైన ప్రభావం ఉండొచ్చు. మరోవైపు చమురు ధరలు, అమెరికా డాలర్, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.