
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా జూలై 1 నుంచి జూలై 5 వరకు పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు నేరుగా ప్రజల్లోకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జూలై 1వ తేదీన సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా చిలకపూరు మండలంలో పర్యటించనున్నారు.
అక్కడ స్వయంగా లబ్ధిదారులకు ‘ఎన్టీఆర్ భరోసా'(NTR Bharosa) పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా శ్రీసిటీలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘హీరో మోటో కార్ప్’ సంస్థ రూ. 750 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించిన ‘గ్లోబల్ పార్ట్స్ సెంటర్’కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగే వీబీజీ రాంజీ కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. అనంతరం తిరుపతిలోనే నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘GSDP కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్’లో పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇక జూలై 3వ తేదీన రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మక ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్’ పనులను కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. కడప పర్యటన ముగించుకుని జూలై 3వ తేదీనే సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం చేరుకుంటారు. జూలై 3 నుంచి జూలై 5వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు కుప్పంలోనే ఆయన బస చేయనున్నారు. ఈ మూడు రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు స్థానిక నేతలు, ప్రజలతో నేరుగా ముఖాముఖి కానున్నారు.