
కర్ణాటకలో విక్రయించే పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తులలో ఏమాత్రం మత్తు పదార్థాలు, హానికర రసాయనాలు కలిపినా వాటిని రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే నిషేధిస్తామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు.
ముఖ్యంగా యువతను మత్తు వ్యసనాల బారి నుండి రక్షించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ ధోరణినీ ప్రదర్శించబోమని తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.
బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో రాజీవ్ గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'నశా ముక్త్ భారత్ అభియాన్' సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. కొన్ని సంస్థలు తమ వ్యాపార లాభాల కోసం గుట్టుచప్పుడు కాకుండా పాన్ మసాలా, గుట్కా, పోకచెక్క వంటి పదార్థాలలో మత్తు రసాయనాలు కలిపి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఇటువంటి ప్రమాదకర పద్ధతుల ద్వారా యువతను మత్తుకు బానిసలను చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. సదరు కంపెనీలు తక్షణమే తమ ఈ అక్రమ రసాయనాల వాడకాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో వాటిపై చట్టపరంగా శాశ్వత నిషేధం విధించడానికి ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టమైన హెచ్చరికలు పంపారు. రాష్ట్రాన్ని మత్తుపదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులుగా సమాజంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు దేశంలో మత్తు వ్యసనాన్ని నిర్మూలించేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఈ సందర్భంగా డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. యువత ఈ వ్యసనాల ఊబిలో పడకుండా కాపాడటంలో డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. మత్తు వ్యసనాల తీవ్రత సమాజంలో పెను సవాలుగా పరిణమించిందని, దీనిని అరికట్టడం ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
సమాజంలోని ప్రతి వర్గం ఏక తాటిపైకి వచ్చి యువతను ఈ వ్యసనాల ఉచ్చులో పడకుండా రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడే ఉదాత్తమైన వృత్తిని ఎంచుకున్న కాబోయే వైద్యులకు ఆయన అభినందనలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, వైద్య విద్య రంగంలో కర్ణాటక దేశంలోనే అగ్రస్థానంలో ఉందని డీకే శివకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 70 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, బెంగళూరు.. దేశానికే హెల్త్ క్యాపిటల్ గా రూపాంతరం చెందిందని చెప్పారు.