
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం వెలుగుచూసింది.
జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్, సియా బాలి వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దైంది. కేతన్ పాస్ పోర్టు కనిపించకపోవడమే ఇందుకు కారణం.
తాజాగా పాస్‌పోర్టు అదృశ్యంపై కేతన్, సియా ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పలు ఆరోపణలు చేశాడు. బాలి పర్యటన కోసం ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సియాతో అతని సోదరుడు కారులో ఎక్కారు. అయితే ఆమెను సోదరుడు సాహిల్ బలవంతంగానే కారులో కూర్చోబెట్టాడట. అనంతరం రావెట్ ప్రాంతానికి చేరుకోగా కేతన్ కారు ఎక్కాడు. కొంతసేపటికి టీ తాగడానికి కారును ఆపమని సియా కోరింది. టీ తాగిన అనంతరం కారు బూట్‌ను ఓపెన్ చేయమని డ్రైవర్‌ను సియా అడిగింది. అనంతరం తన పర్సులోంచి ఆమె ఏదో తీసినట్లు గమనించానని.. అనంతరం వారిని ఎయిర్‌పోర్టులో దించేసినట్లు డ్రైవర్ తెలిపాడు.
అయితే ఎయిర్‌పోర్టు నుంచి కారు బయలుదేరాక రెండు నిమిషాలకు అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కారులో చిన్న బ్యాగ్ మరిచిపోయినట్లు కేతన్ బృందం చెప్పింది. దీంతో వెనక్కి వచ్చి అతను ఆ బ్యాగును ఇచ్చి వెళ్లాడు. 500 మీటర్లు దూరం వెళ్లాక పాస్‌పోర్టు కనిపించడం లేదని మళ్లీ ఫోన్ వచ్చిందట. కారులోనే ఆ పాస్‌పోర్టు పడిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. తన వాహనంలో లేదని చెప్పినా వినకుండా వీడియో కాల్లో చెక్‌చేశారు. ఆ తర్వాత కారును విమానాశ్రయానికి రప్పించుకుని సాహిల్, కేతన్‌లు పరిశీలించారు. దీంతో పాస్‌పోర్టు కనిపించకపోవడంతో ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగారు. అయితే కేతన్ కారు ఎక్కేముందు వరకు సియా, ఆమె సోదరుడు సాహిల్ వాదించుకున్నట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. సియా కారు బూటులోంచి తన పర్సు తీసుకుని ఏదో తీసినట్లు తాను గమనించానని.. అయితే అదేంటో తనకు తెలియదని చెప్పాడు.
ఇక బాలి పర్యటన రద్దు కావడానికి ప్రధాన కారణమైన పాస్‌పోర్టు అదృశ్యంపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ చెప్పిన సమాధానాలు కీలకంగా మారే అవకాశం ఉంది. కేతన్, సియాలు బాలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు, అతని పాస్‌పోర్టును కావాలనే మాయం చేశారని.. ఇది అనుకోకుండా జరిగింది కాదని, అతని హత్య కుట్రకోణంలో భాగమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. గత ఫిబ్రవరిలో కేతన్, సియాలకు నిశ్చితార్థం జరిగింది. జూన్ 6న వారు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లాలనుకున్నారు. ఈ ట్రిప్‌నకు మొత్తం నలుగురు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు పాస్‌పోర్టు కనిపించకుండా పోవడంపై కేతన్ తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం కారులో నలుగురు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కారు ఎక్కేముందు అందరూ తమ పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లను సరిచూసుకున్నారు. వాటన్నింటిని ఒకే పర్సులో ఉంచారని తెలిపారు. కేవలం కేతన్ పాస్‌పోర్టు మాత్రమే మాయం అయిందని అన్నాడు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.