
రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం నుంచి బయటికొస్తున్న బాలిక చింతలపూడి, న్యూస్టుడే: దుప్పటి ఇవ్వాలని అడిగినందుకు ఓ విద్యార్థినిని వార్డెన్ రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం నుంచి బయటికి పంపేసిన ఘటన ఏలూరు...
రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం నుంచి బయటికొస్తున్న బాలిక
చింతలపూడి, న్యూస్టుడే: దుప్పటి ఇవ్వాలని అడిగినందుకు ఓ విద్యార్థినిని వార్డెన్ రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం నుంచి బయటికి పంపేసిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన బాలిక ఇక్కడి సమీకృత వసతిగృహంలో ఉంటూ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి పడుకునే ముందు తనకు దుప్పటి ఇవ్వలేదని వార్డెన్ స్వప్నకు చెప్పింది. వార్డెన్ ఆగ్రహించి సిబ్బందితో విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేయించారు. హాస్టల్లో సీటు లేదని, వెంటనే మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే వసతిగృహానికి చేరుకొని, ఏం జరిగిందని ఆరా తీశారు. వసతిగృహంలో ఉండేలా చూడాలని వేడుకున్నా, వార్డెన్ కనికరించకుండా ఇంటికి పంపించేశారు. ‘మా అమ్మాయి మూడేళ్లుగా ఇదే వసతిగృహంలో చదువుతోంది. ఫిబ్రవరిలో చెయ్యి విరగడంతో ఇంటికి తీసుకెళ్లి, ఇటీవల ఇక్కడ వదిలి వెళ్లా’ అని బాలిక తండ్రి తెలిపారు. ఈ విషయంపై ఏఎస్డబ్ల్యూఓ శ్రీనివాస్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. విద్యార్థినిని రాత్రిపూట ఇంటికి పంపడం సరికాదని, ఈ ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.