
భారత రగ్బీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తూ సాగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సీజన్ 2 గ్రాండ్ సక్సెస్‌గా ముగిసింది.
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో హోమ్ టీమ్ హైదరాబాద్ హీరోస్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో దుమ్ములేపింది. బలమైన ప్రత్యర్థి ముంబై డ్రీమర్స్‌ను 41-17 తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది.
మ్యాచ్ ఆరంభంలో ముంబై కాస్త బాల్ కంట్రోల్ సాధించి జోరు చూపించినా, హైదరాబాద్ డిఫెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో నిలిచింది. పక్కా ప్లానింగ్‌తో కౌంటర్ ఎటాక్‌లకు దిగి ముంబై టీమ్‌కు చుక్కలు చూపించింది. విరామ సమయానికే మ్యాచ్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకున్న హైదరాబాద్ హీరోస్, సెకండ్ హాఫ్లోనూ అదే అగ్రెసివ్ గేమ్‌తో టైటిల్‌ను ముద్దాడింది.
ఆదివారం జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, హైదరాబాద్ హీరోస్ జట్టుకు విన్నర్స్ ట్రోఫీని బహూకరించారు. ప్లేయర్ల స్పోర్ట్స్ మ్యాన్‌షిప్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, SARG చైర్మన్ శివసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు.
కేవలం రాజకీయ ప్రముఖులే కాదు, మెగాస్టార్ చిరంజీవి, ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి వంటి బిగ్ సెలబ్రిటీలు ఈ ముగింపు వేడుకల్లో సందడి చేయడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ప్రైజ్ మనీ కూడా భారీగానే అందించారు. టైటిల్ విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ రూ.45 లక్షల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా, రన్నరప్‌గా నిలిచిన ముంబై డ్రీమర్స్‌కు రూ.25 లక్షలు దక్కాయి. ఇక అంతకుముందు జరిగిన థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై బుల్స్‌ను 22-19 తేడాతో ఉత్కంఠభరితంగా ఓడించిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ టీమ్ రూ.15 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకుంది.
హైదరాబాద్ హీరోస్ టీమ్ వన్-సైడెడ్ విక్టరీ కొట్టడం వెనుక ఆటగాళ్ల క్లినికల్ ఫినిషింగ్ ఉంది. ముఖ్యంగా ఫ్రాన్సిస్కో కాస్కుల్లోలా, తైతైఫోనో తావితాకు, శివమ్ శుక్లా, మాన్యుయెల్ మోరెనో, మారిస్ లాంగ్ లీడ్‌లో ఉండి టీమ్‌ను నడిపించారు. సెకండ్ హాఫ్‌లో డీగో అర్డావో రెండు అదిరిపోయే గోల్స్ చేయగా, కెవిన్ వెకేసా, టెరియో తమాని కూడా గోల్స్ బాది ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. ముంబై టీమ్ వైపు నుంచి ఇథన్ మెక్‌ఫార్లాండ్, జేమ్స్ టర్నర్, సుకూమార్ హెంబ్రోమ్ పోరాడినప్పటికీ హైదరాబాద్ కట్టడిని దాటలేకపోయారు.
రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ మాట్లాడుతూ.. ఈ సీజన్ గత ఏడాది కంటే అన్ని రకాలుగా సూపర్ సక్సెస్ అయిందని, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రాక, బ్రాడ్‌కాస్టింగ్ టెక్నాలజీ, భారీగా వచ్చిన క్రౌడ్ లీగ్ స్థాయిని పెంచాయని అన్నారు. అలాగే ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా జరగడం వల్ల రగ్బీలో మహిళలకు మంచి కెరీర్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జీఎంఆర్ స్పోర్ట్స్ సీఎంబీ సుజోయ్ గంగూలీ మాట్లాడుతూ యువ అథ్లెట్లకు ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రావడం రగ్బీకి ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్‌ను చూపిస్తోందని, ఈ ఈవెంట్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా మారిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.