
భారత పురుషుల వాలీబాల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏవీసీ మెన్స్ కప్ 2026లో తొలిసారిగా పతకాన్ని సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ బహ్రెయిన్‌ను మట్టికరిపించి భారత్ కాంస్యాన్ని కైవసం చేసుకుంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో బహ్రెయిన్‌పై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత జట్టు 25-23, 23-25, 25-21, 25-17 స్కోర్లతో సెట్లను గెలుచుకుంది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో తమ కంటే మెరుగైన స్థానంలో ఉన్న బహ్రెయిన్‌పై గెలిచి భారత ఆటగాళ్లు సత్తా చాటారు.శనివారం జరిగిన సెమీఫైనల్లో ఇండోనేషియాతో ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో భారత్ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే, ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న భారత జట్టు, కాంస్య పతక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్లో పతకం సాధించడం దేశ వాలీబాల్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఆసియాలోని బలమైన జట్లతో పోటీపడి సాధించిన ఈ విజయం, జట్టులో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.