
పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించనుంది. అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరస్పర దాడులను నిలిపివేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించనుంది. అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరస్పర దాడులను నిలిపివేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. అలాగే మంగళవారం ఇరు దేశాల ప్రతినిధులు ఖతార్‌లోని దోహాలో సమావేశం కానున్నారు (US Iran ceasefire).
ఈ చర్చల్లో హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, వాణిజ్య రవాణా పునరుద్ధరణ, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. హోర్ముజ్‌లో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్ నౌకాశ్రయాలపై అమలులో ఉన్న కొన్ని పరిమితులను సడలించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు (US Iran talks Doha meeting).
ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, హోర్ముజ్ జలసంధిపై భద్రతా అంశాలు వంటి కీలక సమస్యలపై ఇంకా తుది అంగీకారం కుదరాల్సి ఉంది (Iran US agreement). ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. 24 గంటల వ్యవధిలోనే, అమెరికా రెండుసార్లు ఇరాన్ సైనిక స్థావరాలు, డ్రోన్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. మళ్లీ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.