దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనతో పాటుగా హీరోయిన్ త్రిష కూడా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు, విజయ్ ను టార్గెట్ చేయడానికి, ప్రత్యర్థి పార్టీల వారు
త్రిష పేరు ఉపయోగించే ఎక్కువగా విమర్శలు చేశారు. వారి మధ్య సంబంధం గురించి పలు రకాల కామెంట్స్ చేశారు. విజయ్ ఎలక్షన్స్ లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా, ప్రతిపక్షాలు ఏదొక విధంగా త్రిష పేరుని లాగుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున త్రిష కూడా పోటీ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రెండు చోట్ల గెలిచిన విజయ్.. ఒక చోట రాజీనామా చేయగా, ఆ స్థానం నుంచి త్రిషని బరిలోకి దించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. భవిష్యత్ లో ఆమె పాలిటిక్స్ లోకి వస్తారేమో తెలియదు కానీ, ఇప్పటికైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రమేయం ఉన్నట్టు కనిపించలేదు. అయితే నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్.. త్రిషను డిప్యూటీ సీఎం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘జన నాయగన్’ నిర్మాత, కేవీఎన్ ప్రోడక్షన్స్ అధినేత కె. వెంకట్ నారాయణను ఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సీఎం విజయ్ నియమించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తనతో సినిమా తీశారని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి కీలక పదవి కట్టబెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా విజయ్ పై విమర్శలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.8 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ట్రానికి చెందినవారు ఒక్కరు కూడా సీఎం విజయ్ కు కనిపించలేదా అని ఉదయకుమార్ ప్రశ్నించారు. విజయ్ తో సినిమా నిర్మించారనే ఒక్క కారణంతో పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కీలక పదవిలో నియమించడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. విజయ్‌తో సినిమాలు తీసినవారికి, ఆయన చిత్రాల్లో నటించినవారికి, తన పర్సనల్ మేనేజర్లకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పనితీరు చూస్తుంటే, మున్ముందు మేడం త్రిషను ఉప ముఖ్యమంత్రిగా నియమించినా ఆశ్చర్యం లేదని ఉదయకుమార్ ఎద్దేవా చేశారు.గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు, విజయ్ నటించిన ‘సర్కార్’ సినిమాపై ఉదయ కుమార్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సినిమాలో జయలలితను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో దర్శక నిర్మాతలు ఆ సీన్స్ డిలీట్ చేశారు. ఆ సమయంలో ఉదయకుమార్ మాట్లాడుతూ.. జయలలితను కించపరిచే ఏ సన్నివేశాలను అన్నాడీఎంకే అంగీకరించదని, విజయ్ ఫ్యాన్స్ కూడా తమ ప్రభుత్వం ఇచ్చిన ఉచితాలు పొందినవారే అని, భవిష్యత్తులో సినీ పరిశ్రమ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.