
ఇప్పుడు అంతా డిజిటలే. చెల్లింపులు, నగదు బదిలీలన్నీ ఆన్లైన్లోనే. క్షణాల్లో పూర్తయ్యే యూపీఐ, ఆన్లైన్ లావాదేవీలను విరివిగా ఉపయోగిస్తున్నాం.
వీటి వినియోగం పెరిగిన కొద్దీ ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్దాడులు కూడా అదే రీతిలో ఎగబాకుతున్నాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా ఉన్నట్లే... డిజిటల్ చెల్లింపులకూ రక్షణ ఉందని మీకు తెలుసా?
వినియోగదారుల ఆర్థిక భద్రత కోసం డిజిటల్ పేమెంట్ ప్రొటెక్షన్ పాలసీలను పలు బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు అమలు చేస్తున్నాయి. వీటితో వినియోగదారుడి అనుమతి లేకుండా జరిగిన డిజిటల్ లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు పరిహారం లభిస్తుంది. ఏటా రూ.499 ప్రీమియంతో రూ.25 వేలు సొమ్ము వరకు రక్షణ లభిస్తుంది. అవసరాల మేరకు రూ.కోటి సొమ్ము వరకు పాలసీని ఎంచుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ సభ్యులకు గంపగుత్తగా కూడా బీమా చేయించుకునే వెసులుబాటు ఉంది.
మోసం జరిగిన వెంటనే సంబంధిత బ్యాంకు లేదా యూపీఐ యాప్‌నకు సమాచారం అందించాలి. అనంతరం అవసరమైతే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. పాలసీ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పిస్తే విచారణ అనంతరం పరిహారం అందుతుంది.
ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మోసాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా.. నష్టాలను కొంత వరకైనా తగ్గించుకోవచ్చు. సరైన అవగాహన, జాగ్రత్తలతో వీటిని వినియోగించుకోవచ్చు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.