Ladakh Pangong Lake Fine : కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పర్యావరణానికి హాని కలిగించేలా ప్రవర్తించిన పర్యాటకులపై అక్కడి యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన లడఖ్ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమంగా ఆఫ్ రోడింగ్ విన్యాసాలు చేసిన నలుగురు పర్యాటకులకు లడఖ్ వన్యప్రాణి విభాగం భారీ జరిమానా విధించింది. వేర్వేరు నాలుగు ఘటనల్లో ఒక్కో పర్యాటకుడికి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా వారి వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. లడఖ్ చరిత్రలోనే పర్యాటకులపై ఇలాంటి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.వన్యప్రాణుల జోన్లలో వాహనాలతో విన్యాసాలు..పోలీసులు, వన్యప్రాణి విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు తమ సొంత వాహనాలతో లడఖ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పాంగాంగ్ సరస్సు, చాంగ్‌థాంగ్, నుబ్రా లోయలోని రక్షిత వన్యప్రాణి జోన్లలోకి అక్రమంగా చొరబడ్డారు. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన ఈ పర్యాటకులు కేవలం సోషల్ మీడియా రీల్స్, స్టంట్ల కోసం పర్యావరణాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. సాధారణ తనిఖీలు, సోషల్ మీడియా నిఘా ద్వారా ఈ ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు జూన్ 26న ఈ భారీ పెనాల్టీలను ఖరారు చేశారు. జరిమానా పూర్తిగా చెల్లించిన తర్వాతే సీజ్ చేసిన వాహనాలను విడుదల చేశారు.రీల్స్ పిచ్చితో నది, సరస్సుల్లోకి దూసుకెళ్లిన తార్, క్రెటాజూన్ 23వ తేదీన పాంగాంగ్ సరస్సు తీరంలోని మేరక్ ప్రాంతంలో పంజాబ్ రిజిస్ట్రేషన్ గల ఒక మహీంద్రా థార్ వాహనాన్ని డ్రైవర్ ఉద్దేశ పూర్వకంగా సరస్సు నీటిలోకి పోనిచ్చి స్టంట్లు చేశాడు. దీనివల్ల సరస్సు నీరు కలుషితమవడమే కాకుండా అక్కడి జీవజాలానికి ముప్పు వాటిల్లింది. అలాగే జూన్ 21వ తేదీన చాంగ్‌థాంగ్ కోల్డ్ డెజర్ట్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ పరిధిలోని లుకుంగ్ వద్ద ఒక హ్యుండయ్ క్రెటా కారుతో ఆఫ్-రోడింగ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. అధికారులు ఆ కారును చాంగ్లా పాస్ వద్ద అడ్డుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా జూన్ 20వ తేదీన కారకోరం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ పరిధిలోని ఒక సహజ సిద్ధమైన నీటి ప్రవాహంలో మరో మహీంద్రా థార్ వాహనంతో విన్యాసాలు చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగించాడో పర్యాటడుగు. జూన్ 17వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక టయోటా ఫార్చ్యూనర్ వాహనంతో పర్యాటకులు నూర్బూ లా ప్రాంతంలో అంతరించిపోతున్న టిబెటన్ గజెల్ (ఒక రకమైన లేడి)ను కారుతో వేటాడటానికి ప్రయత్నించారు. దీనిపై రాత్రికి రాత్రే గాలింపు చేపట్టిన అధికారులు హన్లేలోని ఒక హోమ్‌స్టే వద్ద వాహనాన్ని పట్టుకున్నారు.లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా స్పందన ఇదే..!ఈ ఉల్లంఘనలపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు లడఖ్ ఎల్లప్పుడూ సాదరంగా స్వాగతం పలుకుతుందని, అయితే ఇక్కడికి వచ్చేవారు పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం.. రక్షిత అడవులు, సరస్సుల పరిసరాల్లో ఆఫ్-రోడింగ్ చేయడం శిక్షార్హమైన నేరమని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలు శిక్షతో కూడిన కఠినమైన చర్యలు ఉంటాయని ఎల్జీ హెచ్చరించారు.