
ఇంటర్నెట్‌డెస్క్: అయోధ్య విరాళాల చోరీ కేసులో (Ayodhya Ram Temple) విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్టు చేయగా వారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు
కావడం గమనార్హం. వారి సొంతూరికి వెళ్లి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దాతల విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించేందుకు తొలుత అక్కడ పనికి కుదిరిన అనుకల్ప్ మిశ్రా.. అధికారులను బతిమాలి తన బావ లవ్‌కుశ్ మిశ్రాను పనిలోకి రప్పించాడు. తన బృందంలో సభ్యుడిగా చేసుకున్నాడు. ఈ చోరీల ప్రధానసూత్రధారి అనుకల్ప్ మిశ్రాగానే సిట్ అధికారులు చెబుతున్నారు.
విచారణలో భాగంగా సిట్ అధికారులు అయోధ్యలోని అనుకల్ప్ సొంతూరికి వెళ్లి గ్రామస్థులను ప్రశ్నించగా.. మొన్నమొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న మిశ్రా కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పారు. ఇల్లు, స్కార్పియో వాహనం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అతడి జీవన విధానం కూడా మారిపోయిందని అక్కడున్నవారు తెలిపారు. సొంతూరికి దగ్గర్లో విలాసవంతమైన ఓ ప్రాపర్టీని కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఊరి చివరన ఓ ఫాంహౌస్ కూడా నిర్మించినట్లు పేర్కొన్నారు.
ఇటీవల గ్రామంలో ఏడు రోజుల పాటు పండగ నిర్వహించినట్టు అనుకల్ప్ మిశ్రా తాత రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. మతగురువులను రప్పించి ఉపన్యాసాలు కూడా ఇప్పించినట్లు చెప్పారు. అయితే, ఈ కేసు గురించి తనకు తెలియదన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరైనట్లు చెప్పారు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా వచ్చారన్నారు. ఇంత భారీ స్థాయి కార్యక్రమం నిర్వహించేందుకు డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
బ్యాంక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన అనుకల్ప్ మిశ్రా.. మూడేళ్ల క్రితం విరాళాలను లెక్కించే బృందంలో ఉద్యోగిగా చేరాడు. ఆ తర్వాత తన బావ లవ్‌కుశ్ మిశ్రాను అక్కడికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి.. నిధులను చోరీ చేసినట్లు అనుమానాలున్నాయి. లవ్‌కుశ్ మిశ్రా సొంత గ్రామానికి కూడా అధికారులు వెళ్లగా.. ఇటీవలే రూ.లక్షతో కొత్త బైక్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. మొత్తం 8 మంది నిందితుల ఆర్థిక పరిస్థితులు, వారి ఆస్తుల గురించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.