
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని పలువురు ప్రముఖ రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు యాజమాన్యాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
గచ్చిబౌలి – షా గౌస్ రెస్టారెంట్ వంటగదిలో ఈగలు తిరగడం, అపరిశుభ్రమైన వాతావరణం, తెరిచి ఉన్న డ్రెయిన్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాలు, నీటి నాణ్యత పరీక్షలకు సంబంధించిన రికార్డులు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు. పరిశుభ్రత అంచనాలో కేవలం 65 శాతం మాత్రమే స్కోర్ రావడంతో వెంటనే లోపాలను సరిదిద్దాలని అధికారులు ఆదేశించారు.
హైటెక్ సిటీ – మెహ్ఫిల్ రెస్టారెంట్ వంటగదిలో తగిన స్థలం లేకపోవడం, తడి నేలపై ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే రూమాలీ రొట్టెల తయారీ, పరిశుభ్రత ప్రమాణాల పాటించకపోవడం, ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. హైజీన్ స్కోర్ 67 శాతం మాత్రమే నమోదవడంతో ఇంప్రూవ్మెంట్ నోటీస్ జారీ చేశారు.
మాదాపూర్ – ఐడియల్ కిచెన్ ఈ తనిఖీల్లో అత్యంత ఆందోళన కలిగించిన అంశాలు వెలుగుచూశాయి. ఫ్రీజర్‌లో నిల్వ చేసిన పిండివంటలపై మృత బొద్దింకలు, మినప్పప్పులో పురుగులు, తడి నేలలు, ఆహార వ్యర్థాలు, సరైన నిల్వ సదుపాయాల లేమి, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు నీటి పరీక్షల రికార్డులు లేకపోవడం గుర్తించారు. ఈ సంస్థకు 67 శాతం హైజీన్ స్కోర్ నమోదైంది.
కొండాపూర్ – పాలమూరు గ్రిల్ అండ్ బార్ లేబుళ్లు మార్పిడి చేసిన ఆహార పదార్థాలు, పాత ఆహారం, గడువు ముగిసిన మష్రూమ్లను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. వంటగదిలో ఈగలు, గ్రీజు పేరుకుపోవడం, తుప్పు పట్టిన ఫ్రీజర్, వేడి నీటితో పాత్రలు శుభ్రం చేయకపోవడం, నీటి నాణ్యత పరీక్షల రికార్డులు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు. ఈ రెస్టారెంట్‌కు కేవలం 60 శాతం హైజీన్ స్కోర్ మాత్రమే లభించింది.
ఈ నాలుగు రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసిన అధికారులు, నిర్దేశిత గడువులోగా అన్ని లోపాలను సరిదిద్దాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయట భోజనం చేసే ముందు రెస్టారెంట్ పరిశుభ్రత, ఆహార నాణ్యతపై వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎల్బీనగర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి మహిళ హల్చల్.. డాక్టర్లు, సిబ్బందిపై దాడి!
.