
రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ తిరిగి రావాలని, పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రులు కూడా ఆ బాధ్యతను పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సంతానాన్ని భారంగా చూసే ధోరణి పోయి, వారిని సంపదగా భావించే పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆదివారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.అనంతరం ముఖ్యమంత్రి చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయంగా ముచ్చటించారు. పిల్లలను ఎత్తుకుని ఆడించారు. వారి ఆరోగ్య వివరాలు, వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయంలో తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు వయసున్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగాలు చేసే మహిళలు పిల్లల పెంపకాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగారు. "పిల్లల్ని కని, పెంచడం, వారి ఆలనా పాలనా చూడటం ఒక్క తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఇంట్లో భర్త, ఇతర మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలి"